Telangana: చేపల కోసం చెరువు వద్దకు వెళ్లిన గిరిజనుడు.. ఊహించని విధంగా అక్కడ…

| Edited By: Ram Naramaneni

Aug 16, 2023 | 5:21 PM

స్మగ్లర్లు అరుదైన నక్షత్ర తాబేళ్లను వేటాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని.. అసత్య ప్రచారం చేస్తూ ఉంటారు. నక్షత్ర తాబేళ్లు అన్ని జీవుల్లాంటివే అని.. కాకపోతే వాటి సంతతి అంతరించిపోయే దశలో ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవి బయట ఎవరి వద్ద ఉన్నా చట్టాన్ని మీరినట్లే అవుతుందని.. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆ గిరిజనుడుకి తెలియక నక్షత్ర తాబేలును ఇంటికి తీసుకువచ్చాడని.. దాన్ని స్వాధీనం చేసుకుంటామని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, ఉట్లపల్లి గ్రామంలో గిరిజనుడికి అరుదైన నక్షత్ర తాబేలు లభించింది. ఈ తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని ఆ గిరిజనుడు అ తాబేలును అపురూపంగా చూసుకొంటున్నాడు. వెంకటేష్ అనే గిరిజనుడు చేపల వేటకు ఊరి చివర ఉన్న చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లగా అక్కడ చెరువు వద్ద నక్షత్ర తాబేలు కనబడటంతో దానిని ఇంటికి తీసుకువచ్చాడు. ఈ నక్షత్ర తాబేలు అరుదుగా ఉంటుందని,ఈ తాబేలు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని కొంతమంది చెప్పటంతో ఈ నక్షత్ర తాబేలును ఎంతో అపురూపంగా పెంచుతున్నాడు. ఈ తాబేలును చూడటానికి స్థానికులు ఎంతోమంది వస్తున్నారని,వెంకటేష్ పేర్కొన్నాడు. అయితే నక్షత్ర తాబేళ్లను బంధించడం కరెక్ట్ కాదని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది చెబుతున్నారు. వన్య ప్రాణాలు లేదా అరుదైన జీవులు కనిపించినప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.