అతన్ని చూడగానే కోతులు పరుగో పరుగు..

Updated on: Feb 04, 2026 | 3:25 PM

రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, గెలిచాక మరిచిపోవడం సర్వసాధారణం. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక సర్పంచ్ మాత్రం తన మాట కోసం ఏకంగా వేషం మార్చి వార్తల్లో నిలిచారు. గ్రామస్తులను పీడిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు ఆయన స్వయంగా 'చింపాంజీ' అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు.

గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ ప్రజలు గత కొంతకాలంగా కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, తాము గెలిస్తే కోతుల సమస్య నుంచి విముక్తి కలిగిస్తామని మద్దుల రాజిరెడ్డి హామీ ఇచ్చారు. గెలిచిన అనంతరం ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో ఆయన వినూత్న ఆలోచన చేశారు. కోతులను భయపెట్టేందుకు రాజిరెడ్డి స్వయంగా చింపాంజీ వేషం ధరించి గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. భారీ ఆకారంలో ఉన్న చింపాంజీని చూసి కోతులు భయంతో పరుగులు తీశాయి. సర్పంచ్ స్వయంగా ఇలాంటి వేషం వేసి రంగంలోకి దిగడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. సమస్య ఏదైనా పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుంది అని నిరూపించిన రాజిరెడ్డిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారం ఉన్నా, హోదాను పక్కన పెట్టి సామాన్యుడిలా ప్రజల కోసం శ్రమించిన సర్పంచ్ చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాటల కంటే చేతలే మిన్న అని చాటిచెప్పిన రాజిరెడ్డి నిజంగానే నాగంపేటలో హాట్ టాపిక్‌గా మారారు.