రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ప్రకాశం జిల్లా పొదిలిలో వందలాది ఆధార్, ఏటీఎం, పింఛన్ కార్డులు రోడ్డు పక్కన పడివుండటం కలకలం రేపింది. ప్రభుత్వంచే జారీ చేయబడిన ఈ సున్నితమైన వ్యక్తిగత పత్రాలు ముండ్లమూరు మండలానికి చెందినవిగా గుర్తించారు. డేటా దుర్వినియోగానికి అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోస్టల్ నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం కారణంగా పారవేయబడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
ఇంట్లో భద్రంగా ఉండాల్సిన ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు రోడ్డుపక్కన కనిపిస్తే.. అది కూడా ఒకటీ రెండూ కాదు.. వందల్లో గుట్టలు గుట్టలుగా కనిపిస్తే.. సరిగ్గా అదే జరిగింది ప్రకాశంజిల్లాలో. పొదిలి పట్టణంలో సాయి బాలాజీ నగర్ సమీపంలో రోడ్డు పక్కనే వందలాది ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు, రేషన్–పింఛన్ సంబంధిత కార్డులు , ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక పత్రాలు చెల్లాచెదురుగా పడివుండటం స్థానికులను, అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం ప్రజలకు జారీ చేసే అత్యంత సున్నితమైన వ్యక్తిగత పత్రాలు బహిరంగ ప్రదేశంలో పడివుండడం పెద్ద ప్రశ్నగా మారింది. గుట్టలుగా పడి ఉన్న ఆధార్, ఏటియం, ఇతర వ్యక్తిగత వివరాలు తెలిపే ధృవీకరణ పత్రాలను చిల్లచెట్లలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. చిల్ల చెట్ల మధ్యలో, పొదల్లో, రోడ్డుపక్కన వందలాదిగా ఆధార్ కార్డులు, బ్యాంకు ఏటీఎం కార్డులు, పింఛన్ పత్రాలు వంటి అనేక ముఖ్యమైన కార్డులు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇవన్నీ ముండ్లమూరు మండలానికి చెందిన వ్యక్తులవిగా భావిస్తున్నారు. గుట్టలుగా పడి ఉన్న పత్రాలపై ముండ్లమూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్థానికుల చిరునామాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిగత ప్రైవేట్ డేటా బహిరంగ ప్రదేశాల్లో పడి ఉండటం వల్ల ప్రజల వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్డులు ఎక్కడనుంచి వచ్చాయి? ఎవరు తీసుకువచ్చి ఇక్కడ పారేశారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ పోస్టల్‌శాఖ నుంచి పంపిణీ కావాల్సి ఉన్నవిగా భావిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో బట్వాడాకు వచ్చిన ఉత్తరాలు, కార్డులను పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇక్కడ పారేశారా… లేక ఎవరైనా వీటిని దుర్వినియోగం చేసి అనంతరం ఇక్కడకు తీసుకొచ్చి పారేశారా… అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై మరింత విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
వరుస మరణాలతో వణుకు.. ఐదుకు చేరిన స్క్రబ్ టైఫస్ మృతులు
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను ఓడించాడు
