పదవి కోసం కన్నబిడ్డను.. ఎంతపని చేశావురా

Updated on: Feb 05, 2026 | 4:26 PM

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మహారాష్ట్రకు చెందిన పాండురంగ అనే తండ్రి సర్పంచ్ పదవి కోసం తన కన్నకూతురిని నిజాంసాగర్ కెనాల్‌లో తోసి చంపాడు. ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హుడు కావడంతో, పదవీ వ్యామోహంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మానవత్వం మరిచి చేసిన ఈ హత్యపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత కాలంలో ప్రేమాభిమానాలు, బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా పోతోందా అంటే అవుననే అనిపిస్తోంది.. డబ్బు కోసం కొందరు, పదవి కోసం కొందరు, అక్రమ సంబంధాల కోసం మరికొందరు మానవత్వం మరిచి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కన్నబిడ్డలని కూడా చూడకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది నిజామాబాద్‌ జిల్లాలో. మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలని అతను భావించాడు. అయితే మహారాష్ట్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హుడు కావడంతో, ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్‌తో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. పథకం ప్రకారం మొదట తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి, తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఊరికి వెళ్దామని నమ్మించి, తన పెద్ద కూతురు ప్రాచిని బైక్‌పై ఎక్కించుకుని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంపునకు తీసుకొచ్చాడు. అక్కడ ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని నిజాంసాగర్ డీ-46 కెనాల్‌లోకి తోసేశాడు. జనవరి 30న కాల్వలో బాలిక మృతదేహం దొరకడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలతో గాలించి, మృతురాలు మహారాష్ట్రకు చెందిన ప్రాచిగా గుర్తించారు. నిందితుడు పాండురంగను అదుపులోకి తీసుకుని విచారించగా, సర్పంచ్ పదవి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడు. పదవీ వ్యామోహంతో కన్నకూతురినే బలి తీసుకున్న ఈ కసాయి తండ్రి తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మైఖెల్ జాక్స‌న్ బయోపిక్‌.. ట్రైలర్‌ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్‌

250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్‌ నిర్మాణానికి ట్రంప్‌ ప్లాన్