ఆస్తులు పంచి.. అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి.. కుటుంబం ఆత్మహత్య

Updated on: Jun 17, 2026 | 5:00 PM

నెల్లూరు జిల్లా దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య, దత్తపుత్రుడు ఉరేసుకుని కనిపించారు. ఆస్తుల పంపకం, అంత్యక్రియల ఖర్చుల వివరాలతో కూడిన మరణ వాంగ్మూలం లభించింది. అయితే మృతదేహాల పరిస్థితి పలు అనుమానాలకు తావిస్తుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తులన్నీ బంధువులకు రాసిచ్చారు.. చివరికి తాము చనిపోయాక అంత్యక్రియలకు అయ్యే ఖర్చుల డబ్బును కూడా ముందే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు.. అంతా పక్కా ప్లానింగ్‌తో ఆత్మహత్య చేసుకున్నట్లే ఉన్నా.. మృతదేహాలు ఉన్న తీరు చూస్తే మాత్రం గుండె గుభేల్ మంటోంది. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. మృతులను రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు, ఆయన భార్య రత్నవేణి, దత్తపుత్రుడు సాయి శుక్రుత్‌గా గుర్తించారు. అయితే, ముగ్గురి చేతులు కట్టేసి ఉండటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. సామాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు గది గోడపై ఒక షాకింగ్ నోట్ కనిపించింది. “మా మరణ వాంగ్మూలం బీరువాలో ఉంది” అని గోడపై రాసి ఉండటంతో పోలీసులు బీరువాను తెరిచి ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తమ ఆస్తుల పంపకానికి సంబంధించిన వివరాలను మధుసూదన్ రావు అత్యంత స్పష్టంగా రాశారు. ఆ మరణ వాంగ్మూలంలో.. తమ వద్ద ఉన్న 17 సవర్ల బంగారాన్ని బంధువులకు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్‌ను అక్క కుమారుడికి, మరో ఓపెన్ ప్లాట్‌ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు విరాళంగా ఇవ్వాలని రాశారు. తాము చనిపోయాక అంత్యక్రియల కోసం ఎవరినీ రూపాయి అడగకూడదని.. ఆ ఖర్చులకు సరిపడా డబ్బును రాత్రికి రాత్రే ఒక అక్క అకౌంట్‌కు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు లేఖలో రాయడం అందరినీ కలచివేసింది. మధుసూదన్‌రావు దంపతులకు పిల్లలు లేకపోవడంతో చిన్నతనంలోనే సాయి శుక్రుత్‌ను దత్తత తీసుకున్నారు. అయితే శుక్రుత్ కెరీర్‌లో స్థిరపడకపోవడం, మానసిక ఇబ్బందులతో బాధపడుతుండటంతో ఆ దిగులుతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని బంధువులు, గ్రామస్థులు భావిస్తున్నారు. లేఖలో కూడా ‘వ్యక్తిగత కారణాల’ వల్లే చనిపోతున్నట్లు ఉంది. మృతులు.. తాము పెద్దవారమైపోయామని, తమ మానసిక స్థితి సరిగా ఉండటంలేదని, అలాగే తమ కుమారుడి మానసిక స్థితికూడా సరిగా లేదని, భవిష్యత్తులో ఎలా బ్రతకాలో భయంగా ఉందని.. అందుకే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మరణవాంగ్మూలంలో పేర్కొన్నారని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను బంధువులకు పంచి, అంత్యక్రియల ఖర్చులు కూడా ఎవరికీ భారం కాకూడదని డబ్బులు ఎకౌంట్‌లో వేసి చనిపోవడం తలచుకొని స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!

కార్పొరేట్ లుక్‌లో సర్కారు బడులు.. విద్యార్థులకు సరికొత్త యూనిఫాంలు..

Brazil : ప్రాణం తీసిన బంగీజంప్‌.. ఏం జరిగిందంటే..

అల్లు అర్జున్ ఎఫెక్ట్.. AA23 థీమ్ మ్యూజిక్‌ను ఉపయోగించిన.. ప్రధాని నరేంద్ర మోడి

ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు.. ఆ మూవీని మాత్రం డోంట్ మిస్!

Follow Us