తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన అంగన్‌వాడీ కార్యకర్త

Updated on: Feb 07, 2026 | 9:40 AM

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్‌లో అంగన్‌వాడీ వంటమనిషి కంచన్‌బాయి 20 మంది చిన్నారులను తేనెటీగల దాడి నుండి రక్షించి తన ప్రాణాలను త్యాగం చేసింది. పిల్లలను సురక్షితంగా గదిలోకి తరలించి, వందలాది తేనెటీగల కాట్లకు గురై ఆమె మరణించింది. ఆమె నిస్వార్థ సేవకు గ్రామస్తులు నివాళులర్పిస్తూ, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తేనెతుట్టె తొలగింపు కోసం డిమాండ్ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్ గ్రామంలో ఒక అంగన్‌వాడీ వంట మనిషి చూపిన సాహసం తెగువ అసామాన్యం. అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో 20 మంది చిన్నారులు ఆడుకుంటుండగా, ఒక్కసారిగా తేనెటీగల దండు వారిపై దాడి చేసింది. ప్రమాదాన్ని గమనించిన వంట మనిషి కంచన్ బాయి అప్రమత్తమై, తన ప్రాణాలను లెక్క చేయకుండా చిన్నారులను కాపాడేందుకు సాహసించింది. అక్కడున్న టార్పాలిన్ షీట్లు, చాపలను తీసుకుని, ప్రతి చిన్నారిపై కప్పి, వారిని గదిలోపలికి పంపించింది. ఇంతలో కంచన్ బాయిపై వందలాది తేనెటీగలు దాడి చేశాయి. ఒళ్లంతా తేనెటీగలు కుడుతున్నా, పిల్లలందరినీ సురక్షితంగా గదిలోనికి తరలించే వరకూ ఆమె అక్కడి నుంచి కదలలేదు. తీవ్రంగా గాయపడి స్పృహతప్పిన ఆమెను గ్రామస్తులు, పోలీసులు వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె శరీరంపై ఉన్న లెక్కలేనన్ని తేనెటీగల కాట్లు ఆమె ప్రాణత్యాగానికి మౌన సాక్షులుగా నిలిచాయి. కంచన్ బాయి తన కుటుంబానికి ఏకైక ఆధారం ఆమె భర్త శివలాల్ పక్షవాతంతో మంచానికే పరిమితం కాగా, ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జై మాతాదీ స్వయం సహాయక సంఘానికి అధ్యక్షురాలిగా ఉంటూ, సామాజిక సేవలలోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అంగన్‌వాడీ కేంద్రం సమీపంలోని చెట్టుపై భారీ తేనెతుట్టె వేలాడుతుందని, వెంటనే దానిని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి, చిన్నారులను కాపాడిన కంచన్ బాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు

సముద్రంలో 4 కి.మీ ఈది, కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు

ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది.. కట్ చేస్తే..

పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి

చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి