రెండేళ్ల పిల్లాడిని అడవిలో వదిలేసిన తండ్రి..కారణం ఇదే!
మధ్యప్రదేశ్‌లో దారుణం: అనుమానంతో కట్టుకున్న భార్యను హత్య చేసిన రాజేంద్ర అనే కసాయి తండ్రి, రెండేళ్ల కన్నబిడ్డను రాయ్‌సేన్ అడవిలో వదిలేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, గంటల తరబడి గాలించి అడవిలో చిక్కుకున్న పసివాడిని సురక్షితంగా రక్షించారు. మానవత్వం మరిచి చేసిన ఈ ఘాతుకం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
రాను రాను మానవసంబంధాలు పలుచబడిపోతున్నాయా అనిపిస్తోంది. తల్లి, తండ్రి, కన్నబిడ్డలు, తోడబుట్టినవారు అని చూడకుండా మానవత్వం మరిచి కర్కశంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను కడతేర్చి, ముక్కుపచ్చలారని కన్నబిడ్డను నట్టడవిలో వదిలేశాడు ఓ కసాయితండ్రి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బేగంగంజ్‌కు చెందిన రాజేంద్ర అహిర్‌వార్, భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతమై అతణ్ణి రాక్షసుడిగా మార్చింది. ఈ క్రమంలో కట్టుకున్న భార్యను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేశాడు. మొబైల్ కొనిస్తానని నమ్మించి భార్యా, రెండేళ్ల కుమారుడిని వెంటబెట్టుకొని వెళ్ళాడు. వారిని రాయ్‌సేన్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావని భార్య ప్రశ్నించడంతో ఇరువురిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బండరాయితో భార్యను హతమార్చాడు. ఈ భయానక దృశ్యాన్ని చూసి భయంతో ఏడుస్తున్న పసివాడిపై ఏమాత్రం కనికరం చూపకుండా అడవిలోనే వదిలి పారిపోయాడు. రెండు రోజులు గడిచినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. భార్యను చంపి, బిడ్డను అడవిలో వదిలేశానని అతడు చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు. క్రూరమృగాలు తిరిగే దట్టమైన అడవిలో చిన్నారి ప్రాణాలపై ఆందోళన చెందారు. పసివాడు జీవించి ఉంటాడా? అనే ఆలోచన పోలీసులను సైతం ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే 12 పోలీసు బృందాలను రంగంలోకి దించారు. డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లు, టార్చి లైట్ల సాయంతో 10 గంటల పాటు పోలీసులు అడవిని జల్లెడ పట్టారు. తెల్లవారుజామున ఒక పొద సమీపంలో ఆకలితో అలమటిస్తూ, భయంతో వణికిపోతున్న చిన్నారిని చూసి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పసివాడి పరిస్థితిని చూసి పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. వన్యప్రాణులతో నిండిన అడవిలో దాదాపు 20 గంటల పాటు ఒంటరిగా చెప్పులు లేకుండా ఆ పసివాడు నడిచి ఉంటాడని తలచుకొని ఆశ్చర్యపోయారు. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడు రాజేంద్రపై హత్య, సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్ల పిల్లాడిని అడవిలో వదిలేసిన తండ్రి..కారణం ఇదే!
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే

