ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

Updated on: Mar 19, 2026 | 12:50 PM

విమాన టికెట్ కొన్నాక కూడా వెబ్ చెక్-ఇన్ సమయంలో నచ్చిన సీటు కోసం అదనంగా డబ్బులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. విమానయాన సంస్థలు అనుసరిస్తున్న 'పెయిడ్ సీట్ల' విధానంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి. కేవలం మిగిలిన 40 శాతం సీట్లకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఉంది. గతంలో దాదాపు అన్ని సీట్లను పెయిడ్ కేటగిరీలో చూపిస్తూ రూ. 200 నుండి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వెబ్ చెక్-ఇన్ సమయంలో ఉచిత సీట్లు అందుబాటులో లేకపోయినా లేదా ప్రయాణికుడు సీటును ఎంచుకోకపోయినా, విమానాశ్రయ కౌంటర్ వద్ద వారికి ఉచితంగానే సీటు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీటు కోసం ప్రయాణికులను బలవంతం చేయడం లేదా అదనపు భారం వేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ సహా అన్ని దేశీయ విమానయాన సంస్థలు ఈ కొత్త నిబంధనలను తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిబంధనల అమలును డీజీసీఏ (DGCA) పర్యవేక్షిస్తుంది. నిబంధనలు అతిక్రమించే సంస్థలపై భారీ జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us