సరదాలకు శనివారం .. ఫ్యామిలీకి ఆదివారం .. మారిన ట్రెండ్‌

Updated on: Nov 17, 2025 | 12:31 PM

హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల జీవనశైలిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఐదు రోజుల పనిదినాలతో, శనివారం విందులు, వినోదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సోమవారం ఆఫీస్‌కు ఆలస్యం కాకుండా, ఆదివారం విశ్రాంతి తీసుకునేందుకు శనివారాన్ని సరదాగా గడుపుతున్నారు. యువజంటలు కూడా ఈ కొత్త పోకడను ఆలింగనం చేసుకుంటూ, తమ కోసం, స్నేహితులతో కలిసి శనివారం రాత్రిని ఆస్వాదిస్తున్నారు, ఆదివారాన్ని కుటుంబానికి కేటాయిస్తున్నారు.

ఇటీవల నగరవాసుల జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడల నేపథ్యంలో ఆదివారం స్థానాన్ని క్రమంగా శనివారం ఆక్రమిస్తోంది. హైదరాబాద్​ నగరంలో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. సగటున ప్రతి రెండు కుటుంబాల్లో ఒకరు ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. వారికి వారంలో ఐదు రోజులే పని దినాలు ఉంటాయి. శని, ఆదివారాలు ఆఫీస్​కు సెలవు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం నుంచే ఉపశమనం కోసం ఉద్యోగులు జాలీ మూడ్‌లోకి మారిపోతుంటారు. ఆదాయం ఎక్కువ కావడంతో సహజంగానే ఎక్కువ సేవలు పొందేందుకు ఇష్టపడుతుంటారు. ఆదివారం విందులు, వినోదాలతో ఆలస్యమైతే పిల్లలు స్కూలుకు వెళ్లడం దగ్గర్నుంచి, ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లడం వరకు ఆలస్యమయ్యేది. నిద్రలేమితో ఔట్‌పుట్ పై తీవ్ర ప్రభావం పడేది. ఈ కారణంతో రాత్రి వేడుకలు వీకెండ్స్‌ కి మారాయి. ఆ రోజు అర్ధరాత్రి వరకు గడిపినా, ఆదివారం మొత్తం ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చులే అనే భావనతో ఎక్కువ మంది శనివారం సరదాగా బయట గడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. వివాహం కాగానే అన్ని రకాల స్వేచ్ఛలు కోల్పోయామనే భావన ఎక్కువ మంది యువ జంటల్లో ఉంటుంది. శనివారం సెలవుతో ఈ లోటును కొందరు తీర్చుకుంటున్నారు. స్నేహితులు, తోటి ఉద్యోగులతో ఆ రోజు భలేగా చిల్‌ అవుతున్నారు. వారంలో తన కోసం తాను ఇష్టంగా కేటాయించుకునే ఏకైక రోజుగా చెబుతున్నారు. ఈ తరం యువ జంటలు ఈ పోకడలను ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాయి. ఆ రోజు తమ భాగస్వామి సరదాలకు ఎలాంటి అడ్డు చెప్పడం లేదు. ఆదివారం ఎప్పటిలాగే కుటుంబానికి సమయం కేటాయిస్తూ, చక్కగా గడిపేస్తున్నారు. విందులు, వినోదాలు, సరదాలు, షికార్ల వంటివి ఏవైనా శనివారం జరుపుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు రాత్రిపూట రెస్టారెంట్లు, పబ్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లు, రిసార్టులు విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి. మల్టీప్లెక్స్‌లలో అర్ధరాత్రి షోలు సైతం హౌస్‌ఫుల్‌తో నిండిపోతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడకతో మతిమరుపు దూరం..! మరి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ??

Viral Video: ఇదేందిది.. ఇంటిపైన కొబ్బరిచెట్టా..! ఇలా కూడా పెంచుతారా !!

వీడు మనిషి కాదు.. మహానుభావుడు బాస్.. అలా ఎలా పట్టేసాడు