డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. సీన్ కట్ చేస్తే
ప్రకాశం జిల్లా కందుకూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గుండెపోటు వచ్చిన తల్లి షమీమ్‌ను కాపాడే ప్రయత్నంలో కానిస్టేబుల్ సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అదే సమయంలో, ఆసుపత్రిలో తల్లి కూడా మరణించడంతో ఒకరికొకరు తెలియకుండానే తల్లికొడుకులిద్దరూ లోకాన్ని విడిచివెళ్లారు. రోడ్డు విస్తరణ పనుల్లో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపణలున్నాయి. ఈ విషాదం ఆ కుటుంబాన్ని, స్థానికులను తీవ్ర శోకసంద్రంలో ముంచింది.
తల్లికి గుండెపోటు వచ్చిందని ఫోన్ రాగానే తల్లిని కాపాడుకోవాలనే తపనతో ఆగమేఘాలమీద ఇంటికి వచ్చాడు.. తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు లేకపోవడంతో అంబులెన్స్‌లో మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ రూపంలో కుమారుడిని మృత్యువు మింగేసింది. మరోవైపు గుండెపోటు రూపంలో ఆస్పత్రిలో చేరిన తల్లికూడా మృత్యువాతపడింది. ఒకరికి తెలియకుండా ఒకరు తల్లీకుమారులిద్దరూ చనిపోయారు. ఈ హృదయవిదారక ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ప్రకాశంజిల్లా కందుకూరు పట్టణంలోని సిపాయి పాలెంకు చెందిన షేక్ సాజిద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి 11గంటల తరువాత ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అతని తల్లి షమీమ్ గుండెపోటుకు గురయ్యారని, వెంటనే రావాలని బంధువులు సమాచారం ఇచ్చారు. వెంటనే బైక్‌పై బయలుదేరి ఇంటికి చేరుకున్న సాజిద్ తన తల్లిని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ సమయానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లో మరో అసుపత్రికి తరలిస్తూ తాను బైక్‌పై అనుసరించాడు. మార్గమధ్యంలో కోటారెడ్డి కూడలిలో రోడ్డు సరిగా లేక ఎదురుగా వస్తున్న మరోబైక్ తనను ఢీకొట్టడంతో సాజిద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సాజిద్‌ను ఒంగోలులోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాజిద్ మృతి చెందాడు. మరోవైపు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సాజిద్ తల్లి షమీమ్ కూడా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కానిస్టేబుల్ సాజిద్‌కు భార్య, ముగ్గురుపిల్లలు ఉన్నారు. తల్లి విషమ పరిస్థితుల్లో ఉండగా కాపాడుకునేందుకు తాపత్రయపడి రోడ్డు ప్రమాదంలో సాజిద్ మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి సెంటర్‌లో రోడ్డు విస్తరణ పనుల్లో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి రాత్రి సమయంలో సరిగా కనిపించక కానిస్టేబుల్ సాజిద్‌కు ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రోడ్డు విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో ప్రమాద సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..
Sunita Williams: నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం
SSC Exams 2026: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల