AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

వేగంగా వేడెక్కుతున్న భూమి.. ప్రమాదంలో పెద్దల ప్రాణాలు మేలుకోకుంటే మరణ మృదంగమే !

Phani CH
|

Updated on: Aug 22, 2026 | 6:39 PM

Share

భూతాపం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3°C పెరిగితే భారత్ సహా పలు దేశాల్లో వృద్ధులు తీవ్రమైన వేడి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధుల్లో వేడిని నియంత్రించే శక్తి తక్కువగా ఉండటంతో గుండె, శ్వాస సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. పర్యావరణ పరిరక్షణ అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మన భూమి వేడెక్కుతోంది.. ఇది మనం వింటున్న పాత వార్తే కావొచ్చు, కానీ ఇప్పుడు పెరుగుతున్న వేగం చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒకప్పుడు దశాబ్ద కాలంలో స్వల్పంగా పెరిగే ఉష్ణోగ్రతలు, ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో మానవాళికి మునుపెన్నడూ లేని విధంగా పెను ముప్పును తెచ్చిపెట్టనున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకుంటే, వృద్ధుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ‘ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది భూమి మీద వెలువడే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 85 శాతాన్ని సముద్రాలు గ్రహిస్తాయి కాబట్టి మరో పక్కనుంచీ అవీ వేడెక్కిపోతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న కార్చిచ్చులు, అడవుల ధ్వంసం మూలంగా కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతోంది. దీనిమూలంగా.. ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. గత ఇరవై ఏళ్లలో 50వేల గిగాటన్నుల మంచు కరిగిందని, గత 120 ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు 8 అంగుళాలు పెరిగినట్లు నాసా లెక్కగట్టింది. ఈ మార్పుల వల్లనే తుపాన్ల నష్టం భారీగా పెరుగుతోందనీ గుర్తించింది. ఈ అసాధారణ పరిస్థితుల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతుంటే అందులో ఏడున్నరలక్షల మంది భారతీయులు ఉంటున్నారని లాన్సెట్‌ అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి 1970 నుంచి 2015 వరకు చూస్తే, ప్రతి పదేళ్లకు ఉష్ణోగ్రత పెరుగుదల 0.2°C కంటే తక్కువగానే ఉండేది. కానీ గత పదేళ్లలో ఇది దాదాపు రెట్టింపు అవ్వడం గమనార్హం. అంటే మనం ఊహించిన దానికంటే వేగంగా భూమి నిప్పుల కొలిమిలా మారుతోంది.1880లో ఉష్ణోగ్రతల రికార్డింగ్ మొదలైనప్పటి నుంచి, అత్యంత వేగంగా వేడెక్కిన దశాబ్దం ఇదేనని శాస్త్రవేత్తలు 98 శాతం నమ్మకంతో చెబుతున్నారు. ముఖ్యంగా 2023 నుంచి 2025 వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు భూమి సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక పూర్వ కాలం కంటే 1.5°C ఎక్కువగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం భారత్, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలపై అత్యధికంగా ఉండనుంది. ప్రపంచంలోని మొత్తం వృద్ధ జనాభాలో దాదాపు 73 శాతం మంది ఈ నాలుగు దేశాల్లోనే నివసిస్తుండటం గమనార్హం. గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3°C పెరిగితే, భారత్‌లోని సగానికి పైగా జనాభాతో పాటు 80 శాతానికి పైగా వృద్ధులు ఏడాదిలో కనీసం 180 గంటల పాటు శరీరం తట్టుకోలేని వేడిని ఎదుర్కొంటారు. ప్రధానంగా మే నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ఉదృత్తి మరింత ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. యువకులతో పోలిస్తే వృద్ధులలో శరీరం వేడిని నియంత్రించుకునే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. వయసురీత్యా చెమట పట్టడం తగ్గడం, రక్తనాళాల స్పందన మందగించడం వంటి కారణాల వల్ల వేడి వాతావరణంలో వారి గుండెపై తీవ్రమైన భారం పడుతుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోతే, వృద్ధుల శరీరాలు వేడి నుంచి కోలుకునే అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలపై భారీ ఒత్తిడి పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ మరియు ఇండో-గంగేటిక్ మైదాన ప్రాంతాల్లోని వృద్ధులు ఇప్పటికే వేడి తీవ్రతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఒక డిగ్రీకి పైగా పెరిగిన భూతాపాన్ని ఒకటిన్నర డిగ్రీలకు మించకుండా చూడాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ఏకైక సవాలు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను ఇలాగే కొనసాగించినా 2100 సంవత్సరం నాటికి భూతాపం దాదాపు మూడు డిగ్రీలు పెరుగుతుందని నిపుణుల అంచనా. ఒక్క డిగ్రీకే ఇన్ని రకాల పరిణామాలను చూస్తున్న నేపథ్యంలో, అది మూడు డిగ్రీలు దాటితే… అసలు మానవ జాతి మనుగడ సాగిస్తుందా అన్నది శాస్త్రవేత్తలను వణికిస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో ముందు నుంచే పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే.. భారత్‌లో వృద్ధుల విషయంలో మరణ మృదంగం తప్పదని తాజా లాన్సెట్ అధ్యయనం హెచ్చరికలు జారీ చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

అంతరిక్షంలో అగ్రికల్చర్.. తాజా ఆకుకూరలు పండించిన నాసా వ్యోమగామి

 

Follow Us