హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?

Updated on: Feb 14, 2026 | 9:28 AM

అది అర్ధరాత్రి సమయం.. హాస్టల్‌లో విద్యార్థినులంతా గాఢ నిద్రలో ఉన్నారు. అంతా నిశ్శబ్దంగా ఉన్న వేళ, ఒక్కసారిగా హాస్టల్ ప్రాంగణంలో అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నిద్రపోతున్న బాలికలపై ఎలుకలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. చేతులు, కాళ్లు, ముఖం అని తేడా లేకుండా ఎలుకలు కొరకడంతో 11 మంది విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాల నుంచి రక్తం కారుతుండటంతో చిన్నారులు భయంతో వణికిపోయారు. కేకలు విన్న ఉపాధ్యాయులు అక్కడికి చేరుకుని ఎలుకలను తరిమికొట్టి, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, జరిగిన సంఘటనతో ఆ షాక్‌ నుంచి వారు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశా … హాస్టల్ నిర్వహణలో అపరిశుభ్రత, భద్రతా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నివాస పాఠశాలల్లో విద్యార్థుల రక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు సురక్షితంగా ఉండాల్సిన చోట ఇలాంటి ఘటనలు జరగడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హాస్టళ్లలో కనీస సౌకర్యాలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అందరూ కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us