బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..

Updated on: Jul 05, 2026 | 4:38 PM

హనుమకొండలో కొత్తగా ప్రారంభమైన సురభి ఫుడ్ కోర్ట్ ఉచిత బిర్యానీ పంపిణీ ప్రకటనతో భారీగా జనం తరలివచ్చారు. కేవలం 300 ప్యాకెట్లు మాత్రమే ఉండగా వెయ్యి మందికిపైగా చేరుకోవడంతో తోపులాట, గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భద్రతా ఏర్పాట్ల లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓ హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాహకులు చేసిన ఉచిత బిర్యానీ ప్రకటన హనుమకొండలో ఊహించని గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీసింది. బిర్యానీ పొట్లాల కోసం జనం భారీగా పోటెత్తడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది. చివరకు పోలీసులు ఎంటరవ్వాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ సర్కిల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘సురభి ఫుడ్ కోర్ట్’ నిర్వాహకులు, తమ హోటల్ ప్రారంభోత్సవ కానుకగా 300 మందికి ఉచితంగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఆయన వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే, సోషల్ మీడియా ప్రకటన చూసిన జనం ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. నిర్వాహకులు కేవలం 300 ప్యాకెట్లు అని ప్రకటించినప్పటికీ, వెయ్యి మందికి పైగా జనం పోటెత్తారు. అది చిన్న గల్లీ కావడం, జనమంతా ఒక్కసారిగా బిర్యానీ పొట్లాల కోసం ఎగబడడంతో సీన్ మారిపోయింది. నిర్వాహకులు ప్రచారానికి తగ్గట్టుగా కనీస భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర గందరగోళం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుళ్లు తక్షణమే రంగంలోకి దిగారు. జనాన్ని చెల్లాచెదురు చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చి శాంతిభద్రతలను పునరుద్ధరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ద్రవ్యోల్బణం కంటే ‘ఏఐ’తోనే పెను ముప్పు ఆర్‌బీఐ సంచలన నివేదిక!

నాడు ఏకే-47 పట్టిన చేతులతోనే.. నేడు నాగలిపట్టి సేద్యం

Samantha: బేబీ బంప్‌తో సమంత వర్కౌట్స్.. ఫిట్‌ నెస్‌ విషయంలో నో కాంప్రమైజ్‌

స్వీట్‌ షాపులో కరకరలాడే మిక్చర్‌ తింటున్నారా.. జాగ్రత్త!

Follow Us