టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందనే ఆందోళనల మధ్య, ఫోర్డ్ సంస్థ తన పూర్వ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటోంది. ఏఐ, ఆటోమేటెడ్ వ్యవస్థలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, మానవ అనుభవానికే ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి భిన్నంగా, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి భారతీయ దిగ్గజాలు మాత్రం ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచుకుంటున్నాయి. ఇది టెక్ ప్రపంచంలో సరికొత్త ధోరణిని సూచిస్తుంది.
ఏఐ సాంకేతికతతో ఉద్యోగాలు ఊడిపోతాయనే ఆందోళనల నడుమ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కార్ల ఉత్పత్తి నాణ్యతను పెంచేందుకు ఏర్పాటు చేసుకున్న ఏఐ, ఆటోమేటెడ్ వ్యవస్థలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, ఫోర్డ్ సంస్థ మళ్లీ తన అనుభవజ్ఞులైన పూర్వ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటోంది. గత మూడేళ్లలో సుమారు 350 మంది మాజీ ఇంజనీర్లు, నిపుణులను తిరిగి ఉద్యోగాల్లోకి చేర్చుకుంది. కార్ల తయారీలో ఆటోమేషన్‌పై తాము అతిగా ఆధారపడ్డామని, దశాబ్దాల ఇంజనీరింగ్ అనుభవానికి ఉన్న విలువను నిర్లక్ష్యం చేశామని ఫోర్డ్ సీఓఓ కుమార్ గల్హోత్రా అంగీకరించారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్ల విజ్ఞానాన్ని ఏఐ భర్తీ చేయలేకపోయిందని వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ స్పూన్ స్పష్టం చేశారు.మరోవైపు, భారతీయ దిగ్గజ సంస్థలు మాత్రం తమ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. టెక్ మహీంద్రా పర్‌ప్లెక్సిటీతో, మారుతి సుజుకి ఐదు సరికొత్త ఏఐ స్టార్టప్‌లతో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫిన్లాండ్ సంస్థ నెస్టేతో ఏఐ ఆధారిత ఒప్పందాలు చేసుకున్నాయి. ఒకవైపు ఫోర్డ్ వంటి సంస్థలు మానవ మేధస్సుకే పెద్దపీట వేస్తుండగా, భారతీయ టెక్, ఆటోమొబైల్ రంగాలు మాత్రం ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వేగంగా అడుగులు వేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :