బ్యాంక్ జాబ్ కు రిజైన్.. యువతి పోస్ట్ వైరల్
చదువుకున్న ప్రతీ విద్యార్థి కల గవర్నమెంట్ జాబ్. ఎప్పుడు తీసేస్తారో అనే భయం ఉండదు.. ఫస్టు తారీఖున కచ్చితంగా అకౌంట్‌లో జీతం పడుతుంది.. ప్రమోషన్ల గురించి ఎవరిని ప్రాధేయపడాల్సిన పని లేదు.. సమాజంలో మంచి గౌరవం. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వల్లే చాలా మంది యువత . ఏళ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడి చదువుతారు. అయినా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందా అంటే రాదు.
కష్టంతో పాటు లక్ కూడా కలిసి రావాలంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక్కొక్కళ్లు ఇంత కష్టపడుతుంటే.. ఓ యువతి మాత్రం బ్యాంక్ జాబ్‌కు ఓ దండం అంటూ రిజైన్ చేసింది. అందుకు ఆమె చెప్పిన కారణం వింటే కచ్చితంగా షాకవుతారు. ఢిల్లీకి చెందిన వాణి అనే 29 ఏళ్ల యువతి.. ఎంతో కష్టపడి.. బ్యాంకు కొలువు సాధించింది. నేటి కాలంలో బ్యాంక్ జాబ్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. వాణి కూడా ఏడాదంతా ఐబీపీఎస్ పరీక్షల కోసం ట్రైనింగ్ తీసుకుంది. ఎంతో కష్టపడి చదివితే.. మూడేళ్ల క్రితం 2022లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జాబ్ వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత స్కేల్ వన్ ఆఫీసర్‌గా ఆమెకు మీరట్‌లో పోస్టింగ్ వేశారు. లోన్స్ విభాగంలో ఆమె పని చేసేది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఉద్యోగంలో చేరిన మూడేళ్లకే రాజీనామా చేసింది. ఆమె నిర్ణయంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇంత మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసుకుందనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. దీనిపై వాణి వెర్షన్ ఎలా ఉందంటే.. తను బ్యాంక్ ఉద్యోగంలో చేరక ముందు ఎంతో సంతోషంగా, జాలీగా ఎంజాయ్ చేసేదాన్ననీ.. ఉద్యోగంలో చేరిన ఈ మూడేళ్లలో తన జీవితం పూర్తిగా మారిపోయిందనీ వాపోయింది. ఎంతలా అంటే తనను తాను అసహ్యించుకునే స్థాయికి చేరుకున్నాననీ చెప్పింది. చిరాకు, విసుగుతో అస్సలు మనశ్శాంతి లేకుండా పోయిందనీ చెప్పింది. వీటన్నింటికీ కారణం జాబ్ కాబట్టే ఉద్యోగం మానేశాననీ అంది. ఈ నిర్ణయం పట్ల తనకేం బాధ లేదనీ చెప్పాలంటే ఇప్పుడే తను చాలా సంతోషంగా ఉన్నాననీ చెప్పుకొచ్చింది. తమది కాని ప్రదేశాన్ని విడిచి పెట్టినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదనీ వాణి చెప్పింది. తన నిర్ణయం గురించి తనేం బాధపడటం లేదనీ వాస్తవానికి ఇది తన డ్రీమ్ జాబ్ అని అంది. దీని కోసం తను చాలా కష్టపడ్డానని, కానీ వాస్తవం వేరేలా ఉందనీ చాలా మంది దూరం నుంచే ఏం చూడకుండానే జడ్జ్ చేస్తుంటారనీ అలాంటి వారి మాటలు పట్టించుకోకండి అని హితవు పలికింది. ఇబ్బంది పడుతూ కష్టపెట్టుకుంటూ జీవించడం వల్ల ఎవరికి ఉపయోగం.. ధైర్యంగా నిర్ణయం తీసుకొండి అంటూ ఇన్‌స్టాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
