కాలిన శరీరం..అయినా కొడుకు పుస్తకాలను చదివి… లా కాలేజ్‌లో సీటు పొంది వీడియో
పదేళ్ల క్రితం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆమె శరీరం కాలిపోయినా ఆమెలోని స్ఫూర్తిని మాత్రం ఆర్ప లేకపోయింది. తన చిరకాల స్వప్నాన్ని ఇప్పుడు లా స్కూల్ లో సీటు సాధించి నిజం చేసుకున్నారు. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని చైనాకు చెందిన 50 ఏళ్ల మహిళ నిరూపించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం యాంగ్ అనే ఈ మహిళకు యునన్ ప్రావిన్స్ లోని కున్మింగ్ లో ఉన్న సౌత్ వెస్ట్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ నుంచి జూలైలో అడ్మిషన్ లెటర్ అందింది.
లా గ్రాడ్యుయేట్ స్కూల్ లో చేరిన ఆమె తన జీవితంలో ఇది ఒక కొత్త ప్రయాణమని ఆనందం వ్యక్తం చేశారు. కెమిస్ట్రీలో పట్టా పొందిన యాంగ్ కు మాస్టర్స్ డిగ్రీ చేయాలనేది 20 ఏళ్ల కల. అయితే 2013లో జరిగిన అగ్ని ప్రమాదం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, చేతులు తీవ్రంగా కాలిపోయాయి. ఎడమ చెయ్యి పూర్తిగా పనిచేయకుండా పోగా కుడి చెయ్యి సగం మాత్రమే పనిచేస్తుంది. అప్పటి నుంచి ఆమె మాస్క్ ధరించి బయటికి వస్తున్నారు. ఈ ఘటన తర్వాత తీవ్రమైన డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగానికి కూడా దూరమయ్యారు. రెండేళ్ల క్రితం తన కొడుకుకు ఇదే ప్రవేశ పరీక్షలో విఫలం అవడంతో అతడు వదిలేసిన పుస్తకాలను ఆమె చదవడం ప్రారంభించారు. ఆ పుస్తకాలలోని అంశాలు తనకు అర్థమవుతున్నాయని గ్రహించి పరీక్షకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు పరీక్షల సమయంలో తాను తన కొడుకును జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు పరీక్ష సమయంలోనే తనను వాడు జాగ్రత్తగా చూసుకున్నాడని ఈ పాత్రలు మార్పుతో తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని యాంగ్ తెలిపారు. పరీక్ష హాల్ లోని తనను మాస్క్ తీయమని అడిగినప్పుడు కొందరు విద్యార్థులు తన ముఖం పై మచ్చలు చూసి ఆశ్చర్యపోయారని, కానీ అలాంటి స్పందనలు తనకు అలవాటేనని ఆమె అన్నారు. చాలామందికి రిటైర్మెంట్ అంటే డాన్సులు చేయడం, ప్రయాణాలు చేయడం. కానీ తనకు మాత్రం చదువుకోవడమే రిటైర్మెంట్ జీవితమని యాంగ్ అన్నారు. ఆమె ధైర్యాన్ని, పట్టుదలను సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జీవితంలో ఏదో దశలో ఉన్నా మీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దని ఆమెకు సందేశం ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
