టోల్‌గేట్ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!
నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నోట్ల కట్టలు కలకలం రేపాయి. శ్రీశైలం టోల్గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ, పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీల్లో పెద్ద సంఖ్యలో నోట్ల కట్టలను గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న 30 లక్షల రూపాయల నగదు బయటపడింది. ఈ నగదును దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు శ్రీశైలం పోలీసులకు అప్పగించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో క్షేత్రంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సమయంలో, మహారాష్ట్రకు చెందిన కారులో నగదు కట్టలతో కూడిన బ్యాగును గుర్తించారు. వాహనంలో ఉన్న వ్యక్తులు తాము బంగారం వ్యాపారం చేస్తామని, శ్రీశైలం దర్శనానికి వచ్చామని తెలిపారు. అయితే నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపలేకపోవడంతో అనుమానించిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేసారు. నగదు ఎక్కడిది? ఎక్కడికి తీసుకెళ్తున్నారనే వివరాలు స్పష్టంగా తెలియకపోవడంతో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు శ్రీశైలం ఫస్ట్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలికి చేరుకున్న శ్రీశైలం ఫస్ట్ టౌన్ పోలీసులు 30 లక్షల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. బంగారు వ్యాపారం పేరుతో భారీ మొత్తంలో నగదును క్షేత్రానికి తీసుకురావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం శ్రీశైలంలో చర్చనీయాంశంగా మారింది