వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!

Updated on: Jul 06, 2026 | 5:02 PM

అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ నుంచి రక్తంలా ఎర్రగా ప్రవహించే ‘బ్లడ్ ఫాల్స్’ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఇది రక్తం కాదు.. ఇనుము అధికంగా ఉన్న ఉప్పునీరు ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరపడంతో ఎరుపు రంగులో కనిపిస్తుందని వెల్లడించారు. మంచు కింద లక్షల ఏళ్లుగా దాగి ఉన్న ఈ నీటిలో సూక్ష్మజీవులు జీవించడం మరో ఆశ్చర్యకరమైన అంశంగా నిలిచింది.

ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండమైన అంటార్కిటికాలోని మంచు కొండల నడుమ రక్తంలా ఎర్రగా ప్రవహించే ఒక జలపాతం శతాబ్ద కాలంగా శాస్త్రవేత్తలకు సవాలుగా నిలిచింది. చూసేందుకు మంచు కొండల గుండెల్లోంచి రక్తం కారుతున్నట్లు కనిపించే ఈ వింత జలపాతాన్ని ‘బ్లడ్ ఫాల్స్’ అని పిలుస్తారు. టేలర్ గ్లేసియర్ నుండి ప్రవహించే ఈ జలపాతం ఎరుపు రంగు వెనకున్న అసలు రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. పరిశోధనల ప్రకారం.. ఈ జలపాతంలో ప్రవహించేది రక్తం కాదు, ఇనుము అత్యంత అధికంగా ఉండే ఉప్పునీరు. మంచు పొరల అడుగున ఉండే ఈ నీరు బయటకు రాగానే, వాతావరణంలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరిపి క్షణాల్లో తుప్పు రంగులోకి మారుతుంది. అందుకే ఈ నీరు ప్రవహిస్తున్నప్పుడు రక్తంలా ఎర్రగా కనిపిస్తుంది. ఈ నీటి మూలం టేలర్ గ్లేసియర్ కింద సుమారు 400 మీటర్ల లోతులో దాగి ఉంది. దాదాపు 15 లక్షల సంవత్సరాల క్రితం సముద్రపు నీరు మంచు కింద చిక్కుకుపోయి, కాలక్రమంలో తీవ్రమైన ఉప్పునీటి సరస్సుగా మారింది. సాధారణ నీటి కంటే ఇందులో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉండటం వల్లే, మైనస్ డిగ్రీల అత్యంత తీవ్ర చలిలో కూడా ఈ నీరు గడ్డకట్టకుండా ద్రవరూపంలోనే ప్రవహిస్తోంది. 1911లో ఆస్ట్రేలియా భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ ఈ జలపాతాన్ని తొలిసారి గుర్తించారు. అప్పట్లో ఎరుపు రంగుకు ‘ఆల్గే’ కారణమని భావించినప్పటికీ, 2017లో అలాస్కా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రాడార్ సాయంతో మంచు కొండల్లోని రహస్య మార్గాలను కనుగొన్నారు. తాజాగా ‘అంటార్కిటిక్‌ సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గ్లేసియర్‌లో ఏర్పడే చిన్న చిన్న పగుళ్ల ద్వారానే ఈ ఉప్పునీరు ఒత్తిడి వల్ల అప్పుడప్పుడు బ్లడ్ ఫాల్స్‌గా బయటకు వస్తోందని స్పష్టమైంది. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అసలు సూర్యకాంతి, ఆక్సిజన్ లేని ఆ చీకటి పురాతన సరస్సులో లక్షల ఏళ్లుగా కొన్ని రకాల సూక్ష్మజీవులు జీవిస్తున్నాయి. కాంతి లేకుండా కేవలం రసాయన చర్యల ద్వారానే ఇవి మనుగడ సాగిస్తుండటం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. భూమి వెలుపల మంచుతో కప్పి ఉండే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై కూడా ఇలాంటి కఠిన పరిస్థితుల్లో జీవం ఉండే అవకాశాలను అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన అత్యంత కీలకంగా మారనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరంగల్‌లో ప్లాస్టిక్ పార్క్.. చెత్తతో అద్భుతాలు!

అద్భుతం.. పెంకులేని గుడ్డునుంచి కోడిపిల్ల పుట్టింది!

శ్రీవారి వైభోగం..! జూన్‌లో రూ.128.29 కోట్ల ఆదాయం.. వేసవిలో ఆల్‌టైమ్ రికార్డ్!

Papikondalu: ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్.. పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?

E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ!

Follow Us