పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో

Updated on: Dec 07, 2025 | 11:18 AM

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోని సర్పంచ్​ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. కాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జనం దృష్టికి వస్తున్నాయి. ఒక ఇంట్లో నుంచే అన్నదమ్ములు పోటీపడటం, ఒకే గ్రామంలోనే తల్లీ కూతుళ్ల మధ్య పోరు ఇలా ఎన్నో వింత సన్నివేశాల గురించి మనం వార్తల్లో చూశాం. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ ఎన్నిక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎందుకంటే ఆ గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థి బీఆర్ఎస్ కీలక నేతకు తండ్రి కావడం.. అందులోనూ ఆయన వయస్సు 95 ఏళ్లు కావడంతో ఆ గ్రామంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.నాగారం గ్రామ పంచాయతీ జనరల్ రిజర్వ్ అయింది. గ్రామానికి చెందిన 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామ చంద్రారెడ్డి. రాష్ట్రంలో సర్పంచ్ పదవికి పోటీచేస్తున్న అత్యధిక వయస్సు గల అభ్యర్థిగా ఆయన రికార్డులకు ఎక్కారు. యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో.. తనకు వయసుతో సంబంధం లేదని, తనను గెలిపిస్తే యువకుల అద్భుతంగా పనిచేస్తానని అంటున్నారాయన. వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని, తన అనుభవంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.