94 ఏళ్ల చెరుకురసం వ్యాపారి చెప్పిన జీవన సత్యాలు.. ఒక్క మాటతో నెటిజన్ల హృదయాలు గెలిచిన తాత
ముంబైలో 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణం నడుపుతున్న 94 ఏళ్ల సాదిక్‌పాల్ తన జీవిత అనుభవాలతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. నిజాయితీ, కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం వంటి విలువలే విజయానికి పునాది అని ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోకు ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఆయన జీవన తత్వం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో నిజాయితీ, దయ అన్నవి మచ్చుకైనా కనిపించడం లేదు. ఎంతసేపు పెద్ద అవకాశాలు, క్షణాల్లో విజయం, తక్షణ సంతృప్తి కే ప్రాముఖ్యత ఇస్తున్నారు. రోజువారీ జీవితంలో ఉండాల్సిన కరుణ, సహనం, వినయం, మానవ సంబంధాల ప్రాముఖ్యతను మర్చిపోతున్నారు. జీవితంలో విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా వాటిని ఆచరిస్తూ అర్థవంతంగా బతుకుతున్నవారూ ఉన్నారు. ఈ 94 ఏళ్ల వ్యాపారి ఆ కోవకు చెందిన వ్యక్తే. అతడితో మాటలు కలిపితే మనసుకు హత్తుకునే తియ్యటి జీవిత పాఠాలు తెలుసుకోవచ్చు. ఆ వ్యాపారితో కాసేపు సరదాగా మాట్లాడిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు డిజిటల్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ. వీడియోలో కనిపిస్తున్న వృద్ధవ్యాపారి పేరు సాదిక్‌పాల్. ముంబైలోని ఖార్ స్టేషన్ ఎదురుగా 80 ఏళ్లకు పైగా చెరుకురసం దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన తండ్రి ప్రారంభించిన దుకాణాన్ని తను మరింతగా అభివృద్ధి చేశారట. ప్రస్తుతం ఆ తాత గారు , ఆయన కుమారుడు ఆ దుకాణాన్ని నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణాన్ని నడిపేటప్పటికీ రెండో తరగతి చదువుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. తన అపార అనుభవాన్ని వివరిస్తూ.. గొప్ప జీవిత పాఠాలను కూడా చెప్పుకొచ్చారు. దృఢ సంకల్పంతో ఉండటం, ధైర్యంగా ఉండటం, కష్టపడి పనిచయడం ఎంత ముఖ్యమో చెప్పారు. నిజాయితీగా ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు అందుకోగలమో వివరించారు. ఎవ్వరూ మిమ్మల్ని, మీ నిజాయితీని గుర్తించకపోయినా..ఎవ్వరినీ వంచించొద్దు అని అమూల్యమైన సలహా ఇచ్చారు. నిజానికి ఆ క్షణంలో మన నిజాయితీ, ఆత్మవిశ్వాసాన్ని గుర్తించి గౌరవించకపోవచ్చేమో గానీ, ఎప్పటికీ మాత్రం అలా ఉండదని అన్నారు. మన లక్ష్యాలను సాధించడానికి, కలలను నెరవేర్చుకోవడానికి ఒకే ఒక్క మార్గం కష్టపడటం అని, అందరూ మంచిగా కష్టపడి ప్రయోజకులుగా మారండని కోరుతూ తన సంభాషణను ముగించారు సాదిక పాల్. వీడియో నెటిజన్ల మనసులను గెలుచుకోవడమే గాక, ఆయన సలహా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఆయనకున్న అభిరుచి, విలువలు నిజంగా ప్రశంసనీయం అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎల్‌నినో ముప్పు.. ఈ ఏడాదికి ఈ పంటలే బెస్ట్.. రేటుకు రేటు, ప్రభుత్వం హామీ
Silver Price: వెండి దిగుమతిపై కేంద్రం ఆంక్షలు.. మళ్లీ ధర కొండెక్కుతుందా?
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్.. స్కూటీలోనే అన్నీ