AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

అతిగా ఎలక్ట్రోలైట్లు తాగుతున్నారా? మీ కిడ్నీలు సెడ్డుకే.. !

Phani CH
|

Updated on: Jun 16, 2026 | 3:29 PM

Share

ఎలక్ట్రోలైట్లు శరీరానికి అవసరమైన ఖనిజాలే అయినప్పటికీ, అవసరం లేకుండా తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక సోడియం, పొటాషియం వల్ల రక్తపోటు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. సాధారణ పరిస్థితుల్లో మంచి నీరు, పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి సహజ వనరులే శరీరానికి తగిన హైడ్రేషన్‌ను అందిస్తాయి.

ఇటీవలి కాలంలో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ట్రెండ్స్‌లో ‘ఎలక్ట్రోలైట్స్’ అనే పదం బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం క్రీడాకారులు, తీవ్రమైన ఎండలో శ్రమించేవారు లేదా విరేచనాలు, వాంతులతో నీరసించిన వారు మాత్రమే తీసుకునే ఓఆర్ఎస్ , ఎలక్ట్రోలైట్ పౌడర్లు, ఎనర్జీ డ్రింక్స్.. ఇప్పుడు సామాన్యుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఆఫీసుల్లో కూర్చున్నా, కాసేపు జిమ్‌కు వెళ్లినా, ప్రయాణాల్లో ఉన్నా, అంతెందుకు ఇంట్లో ఏసీలో కూర్చుని కూడా చాలామంది పదే పదే ఎలక్ట్రోలైట్ మిశ్రమాలను నీళ్లలో కలుపుకుని తాగేస్తున్నారు. అయితే.. శరీరానికి ఏమాత్రం ఎలక్ట్రోలైట్లు అవసరమే అయినప్పటికీ, అవసరం లేకపోయినా ప్రతి చిన్న విషయానికి వాటిని వాడటం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు, ముఖ్యంగా కిడ్నీ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. ఎలక్ట్రోలైట్లను మితిమీరి వాడటం వల్ల వచ్చే నష్టాలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో చూద్దాం. చాలామంది ఎలక్ట్రోలైట్లను కేవలం శక్తినిచ్చే లవణాలుగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఎలక్ట్రోలైట్లలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు క్లోరైడ్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి మన నాడీ వ్యవస్థ పనితీరును, కండరాల సంకోచ వ్యాకోచాలను, రక్తపోటును మరియు శరీరంలో ద్రవాల సమతుల్యతను నియంత్రిస్తాయి. మన శరీరానికి ఇవి చాలా నిర్దిష్టమైన మోతాదులో మాత్రమే అవసరం. ఏవైనా ఖనిజాలు ఎక్కువైతే మంచిది అనే ఆలోచన ఇక్కడ అస్సలు పనికిరాదు. సాధారణంగా తీవ్రమైన ఎండ వల్ల శరీరంలో చెమట రూపంలో ద్రవాలు ఆవిరైనప్పుడు, లేదా వాంతులు, విరేచనాలు, తీవ్రమైన జ్వరం వల్ల డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు మాత్రమే వైద్యులు వీటిని సిఫార్సు చేస్తారు. ఏ శారీరక శ్రమ లేనప్పుడు వీటిని పదే పదే తీసుకోవడం వల్ల శరీరం యొక్క సహజ సమతుల్యత దెబ్బతింటుంది. ప్రసిద్ధ వైద్య జర్నల్ ‘న్యూట్రియెంట్స్’ లో ప్రచురితమైన 2023 అధ్యయనం ప్రకారం.. మార్కెట్లో లభించే చాలా రకాల ఎలక్ట్రోలైట్ పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్‌లో సోడియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటోంది. మనం రోజూ తినే ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, హోటల్ భోజనాల ద్వారా ఇప్పటికే శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఉప్పు అందుతోంది. దీనికి తోడు అదనంగా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ కూడా తాగితే శరీరంలో సోడియం భారం మోతాదుకు మించిపోతుంది. దీనివల్ల…శరీరం నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది. దాంతో శరీరం ఉబ్బినట్లు అనిపించడం, రక్తపోటు పెరగడం జరుగుతుంది. రక్తాన్ని వడపోసే కిడ్నీలపై అనవసరమైన అదనపు భారం పడుతుంది. ఇప్పటికే బీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. “హైడ్రేషన్ డ్రింక్స్ ఆరోగ్యకరమైనవి కాబట్టి అవి ఎల్లప్పుడూ సురక్షితం” అనే భ్రమలో ప్రజలు ఉన్నారని, కానీ కంపెనీలు వాటిని ఎంతలా మార్కెటింగ్ చేసినా.. అనవసరంగా తీసుకుంటే అవి హాని చేస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. “శరీరంలో అలసట లేదా తల తిరిగినట్లు అనిపిస్తే చాలామంది అది ఎలక్ట్రోలైట్ల లోపం అనుకుంటారనీ, కానీ, ఎలక్ట్రోలైట్లు ఎక్కువైనా కూడా అదే రకమైన లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రోలైట్ల ద్వారా మెగ్నీషియం ఎక్కువైతే విరేచనాలు, కడుపునొప్పివంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం.. శరీరంలోని అదనపు పొటాషియంను బయటకు పంపే బాధ్యత కిడ్నీలదే. ఒకవేళ కిడ్నీల పనితీరు కాస్త మందగించినా లేదా ఎక్కువ మొత్తంలో పొటాషియం శరీరంలో చేరినా అది ప్రాణాంతకంగా మారుతుంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది గుండె కొట్టుకునే లయను తారుమారు చేస్తుంది. కొంతమంది ఎలక్ట్రోలైట్ పౌడర్లను తగినంత నీటిలో కలపకుండా, గాఢత ఎక్కువగా ఉన్నప్పుడే తాగేస్తుంటారు. దీనివల్ల కడుపు ఉబ్బరం, వికారం, కండరాల నొప్పులు వస్తాయి. మన శరీరంలో అద్భుతమైన వడపోత వ్యవస్థ ఉంది. కిడ్నీలు నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ, శరీరానికి అవసరమైన లవణాలను ఉంచుకుని, మిగిలిన వ్యర్థాలను, అదనపు ఖనిజాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. శరీరంలో ద్రవాల కొరత లేనప్పుడు కూడా మనం బయటి నుంచి సప్లిమెంట్లను ఇస్తూ ఉంటే, ఆ అదనపు లవణాలను బయటకు పంపడానికి కిడ్నీలు రాత్రింబగళ్లు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ వెల్నెస్ ట్రెండ్స్, ఫిట్‌నెస్ రీల్స్ చూసి ప్రభావితమవుతున్న నేటి యువత.. అసలు తమకు డీహైడ్రేషన్ ఉందో లేదో కూడా చూసుకోకుండా రోజుకు రెండు, మూడు ఎలక్ట్రోలైట్ సాచెట్లను నీళ్లలో కలుపుకుని తాగుతున్నారు. ఇది కిడ్నీలను బలహీనపరుస్తుంది. జిమ్‌లో అడుగుపెట్టగానే చేతిలో రంగురంగుల ఎలక్ట్రోలైట్ బాటిల్ పట్టుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. అయితే గంటలోపు చేసే సాధారణ వ్యాయామాలకు లేదా ఇండోర్ వర్కవుట్లకు కేవలం మంచి నీరు తాగితే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన ఎండలో గంటల తరబడి శారీరక శ్రమ చేసినప్పుడు, అథ్లెట్లు మారథాన్‌లు పరిగెత్తినప్పుడు, విపరీతంగా చెమట పట్టి శరీరం పూర్తిగా అలసిపోయినప్పుడు మాత్రమే ఎలక్ట్రోలైట్ల అవసరం ఉంటుంది. కానీ, 30 నిమిషాల పాటు ఏసీ జిమ్‌లో చేసే సాధారణ వ్యాయామానికి ఎలక్ట్రోలైట్ లోడింగ్ అవసరం లేదు. కిడ్ని వ్యాధులు ఉన్నవారు, మధుమేహ బాధితులు, అధిక రక్తపోటు, కాలేయ సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత రోగులు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి హైడ్రేషన్ సప్లిమెంట్లను ముట్టుకోకూడదు. వైద్యులు రోగి కిడ్నీల సామర్థ్యాన్ని బట్టి పొటాషియం, సోడియం వంటి వాటిని నియంత్రిస్తారు. అలాంటప్పుడు సొంత నిర్ణయాలతో ఇటువంటి పానీయాలు తాగితే ప్రాణాలకే ముప్పు రావచ్చు. అలాగే వృద్ధులు, రకరకాల మందులు వాడే వారు కూడా వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రోలైట్లు శరీరానికి హానికరం కాదు, అవి అత్యంత అవసరమైనవి. కానీ వాటిని అనవసరంగా, మితిమీరి వాడటం వల్లే సమస్యలు వస్తాయి. శరీరానికి తగినంత హైడ్రేషన్ అందాలంటే ఎల్లప్పుడూ రంగురంగుల బాటిళ్లు, కెమికల్ పౌడర్లు అవసరం లేదు. మనం రోజూ తాగే మంచి నీరు, ఇంట్లో వండుకునే సమతుల్య ఆహారం, తాజా పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ల ద్వారా శరీరానికి కావలసిన సహజ సిద్ధమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. కాబట్టి ఆన్‌లైన్ ట్రెండ్స్ చూసి మోసపోకుండా, అవసరమైతే తప్ప ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్లను వాడకపోవడమే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. ఇది కేవలం మీ అవగాహన కోసం ఇచ్చిన సమాచారం మాత్రమే. ఈ అంశానికి చెందిన ఏ ఇతర అనుమానాలున్నా మీరు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లీనర్‌, కార్ వాషర్‌గా చిన్నా చితకా పనులు చేసి.. కోట్లు సంపాదించాడు

కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!

అప్పుల్లో ముందున్న మిలియనీల్స్.. వారి వెనకే దూసుకొస్తున్న జెన్-జీ

Follow Us