తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
అన్నమయ్య కాలిబాటలో వన్యప్రాణుల సంచారం ఎక్కువ కావడంతో, తిరుమల అటవీ శాఖ ఈ మార్గాన్ని మూసివేసింది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు అందుబాటులో ఉన్నాయని, భక్తులు రహదారుల ద్వారా ప్రయాణించాలని సూచించారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతంలోకి ప్రవేశం నిషేధం అని హెచ్చరించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శంచుకోడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. చాలామంది నడకమార్గం ద్వారా పాదయాత్రగా ఏడుకొండలూ ఎక్కి శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల చేరుకోడానికి ప్రధానంగా అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్టుమార్గం ద్వారా భక్తులు పాదయాత్రగా వెళ్తారు. అలిపిరి మార్గం పొడవైనది. ఎక్కువగా అలిపిరి నుంచే భక్తులు తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు. ఈ నడక మార్గం అలిపిరి వద్ద ప్రారంభమవుతుంది. నడక ద్వారా వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ లభిస్తుంది. ఈ మార్గంలో భక్తులు తమ టోకెన్లను 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయాలి. అలాగే శ్రీవారి మెట్టుమార్గం… శ్రీనివాస మంగాపురం సమీపంలో ప్రారంభమవుతుంది. అలిపిరి మార్గంతో పోలిస్తే ఇది తక్కువ దూరం. తక్కువ సమయం పడుతుంది. కానీ తిరుమలకు వెళ్లడానికి మరో నడకమార్గం కూడా ఉంది. అదే అన్నమయ్య కాలిబాట. కడప జిల్లా తాళ్లపాకకు చెందిన కవి అన్నమాచార్యుడు తిరుమలకు ఈ మార్గం గుండానే వెళ్ళారని నమ్ముతారు. ఈ కాలిబాట శేషాచలం అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది. కొన్నిసార్లు భద్రత దృష్ట్యా అటవీ శాఖ అధికారులు ఈ మార్గాన్ని మూసివేసి, భక్తులను నిలిపివేస్తారు. ప్రస్తుతం ఈ మార్గంలో తిరుమల పాదయాత్రను నిలిపివేశారు అటవీశాఖ అధికారులు. ఈ క్రమంలో రాజంపేట జిల్లా అటవీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునిబిల్లి, జిల్లా ఫారెస్ట్ అధికారి జగన్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కుక్కల దొడ్డి సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు, క్రూర మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది. తాజాగా 15 ఏనుగుల గుంపు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులులు, ఎలుగుబంట్లు సంచారం కూడా ఎక్కువగా ఉందని, కనుక భక్తులు ఈ మార్గం గుండా తిరుమలకు వెళ్తే జంతువులు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్నమయ్య కాలిబాట ద్వారా పాదయాత్రకు వెళ్లాలనుకునే భక్తులు అటవీమార్గంలో కాకుండా రహదారుల మీదుగా వెళ్లాలని సూచించారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించడాన్ని నిషేధించినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
ప్రైవేటు క్యాబ్ ట్యాక్సీల దోపిడీకి చెక్.. భారత్ టాక్సీ సేవలు షురూ..!
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్ పంపిన పాక్.. సాయంలోనూ కల్తీనా
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే
