Andhra: కాపలాగా పెట్టిన కుక్క గాఢనిద్రలో.. వేసిన తలుపు తెరిచి ఉంది.. అనుమానమొచ్చి చూడగా

Edited By: Ravi Kiran

Updated on: Sep 02, 2025 | 10:59 AM

ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటి వైపు చూసినా, ఇంటి ఆవరణలోకి వచ్చినా ఆ కుక్క పట్టేస్తుంది.. అరుస్తుంది.. అవసరమైతే కరుస్తుంది. గట్టిగా అరిస్తే చుట్టుపక్కల వాళ్లు వస్తారనే ఉద్దేశంతో దొంగలు ప్లాన్ వేశారు. అంతే మత్తు బిస్కెట్లు వేసి అరవకుండా, కరవకుండా చేసి వచ్చిన పని కానిచ్చేశారు.

కర్నూలు జిల్లా ఆదోని నగరంలోని ఆర్టీసీ కాలనీ సింహపురి ఎస్టేట్‌లో భారీ చోరీ జరిగింది. కోసిగి పీహెచ్‌సిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వంశీకృష్ణ శనివారం ఇంటికి తాళాలు వేసి గుంతకల్లులో ఉన్న తన భార్య వద్దకు వెళ్లారు. కాంపౌండ్‌లో కుక్కను వదిలి వెళ్లారు. కాగా ఇంటి తలుపులు పగిలి ఉండటాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు వెంటనే వంశీకృష్ణకు సమాచారం ఇచ్చారు. దొంగలు కాంపౌండ్‌లో ఉన్న కుక్కకు మత్తు బిస్కెట్లు వేసి తర్వాత దానిని కట్టేసి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, 45 వేల వెండి వస్తువులు దొంగిలించారు. అలాగే స్థానికంగా మరో రెండు ఇళ్లల్లో చోరీకి ప్రయత్నించారు. ఓ ఇంటిలో ఎవరూ నివాసం లేకపోవడం, మరో ఇంటికి సెంట్రల్ లాక్ కారణంగా తాళాలు తెరుచుకోకపోవడంతో దొంగలు వెను తిరిగి వెళ్ళినట్లు సమాచారం. బాధితుడు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.