Telangana: ఎన్నికలేమో లోకల్.. వ్యూహాలేమో స్టేట్ లెవల్..
ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలే అయినా క్షేత్రస్థాయిలో పట్టు నిలబెట్టుకోవాలంటే.. పంచాయతీ పాలకవర్గాలే కీలకం. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు తమ పార్టీ బలపరిచిన వారిని బరిలో నిలిపి.. గెలిపించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్.. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయటంతో.. మరో నెల రోజుల పాటు రాష్ట్రమంతా ఎన్నికల సందడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డులకు.. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం మూడు విడతలుగా ఈ పంచాయితీ ఎన్నికలు ఉంటాయి. డిసెంబర్ 11న తొలిదశ, 14 రెండవ దశ, 17న చివరి దశ పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ పడే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
