చలి గుప్పిట్లో తెలంగాణ.. నెల రోజులుగా వణుకే..
తెలంగాణ రాష్ట్రం అసాధారణ చలి గుప్పిట్లో చిక్కుకుంది. మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రజలు రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలతో వణికిపోతున్నారు. నెలరోజులుగా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాది శీతల గాలులు, లానినో ప్రభావం వంటివి దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగనుంది.
తెలంగాణ చలి గుప్పిట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేనంత చలి కారణంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలతో బాటు మైదాన ప్రాంతాల వారూ వణికిపోతున్నారు. సాధారణంగా శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిపెరగటం సహజమే. గతంలో ఈ సీజన్‌లో వరుసగా నాలుగైదు రోజులు విపరీతమైన చలి ఉండేది. తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యేవి. కానీ, ఈ ఏడాది మాత్రం రాష్ట్రంలో అందుకు భిన్నమైన వాతవరణం నెలకొంది. నవంబరులో వరుసగా పది, పన్నెండు రోజులపాటు చలి ప్రభావం కనిపించగా, డిసెంబరు 6 నుంచి నేటి వరకు రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. నెలరోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీలలోపే రాత్రి ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ముఖ్యంగా గత 20 రోజులుగా ఉత్తరాది నుంచి శీతల గాలులు ఎక్కువ అయ్యాయి. దీనికి తోడు లానినో ప్రభావం, విస్తారమైన వర్షాల మూలంగా జలాశయాల్లో పెరిగిన నీటి నిల్వలు, అల్పపీడనాలు, తుఫానులు లేకపోవటంతో ఆకాశం మేఘావృతం కాకపోవటం, వాతావరణంలో తేమశాతం తగ్గడం వంటివి దీనికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో డిసెంబరు చివరి నుంచి జనవరి రెండో వారం మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి నవంబరు రెండోవారం నుంచే మొదలైంది. డిసెంబరు రెండో వారానికే అంటే నెల రోజులు ముందుగానే పతాక స్థాయికి చేరింది. కోహిర్, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో 25 రోజులుగా ఆరేడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మిగతా జిల్లాల్లోనూ 10 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌నూ చలి వణికిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో 8 నుంచి 12 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా హిమాలయాలకు దగ్గరగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొనడం అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని రోజులు చలి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. తెల్లవారుజాము,ఉదయం వేళల్లో పొగమంచు ముసురుకుని,మసక వాతావరణం నెలకొంటుందని తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ధోనీ కారులో అది చూసి నెటిజన్లు షాక్.. వీడియో వైరల్
వీరు పాన్-ఆధార్ లింక్ చేయనక్కర్లేదా ??
