AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!

ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్! తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ విప్లవం!

Phani CH
|

Updated on: Nov 10, 2026 | 4:10 PM

Share

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను విస్తరించేందుకు కేంద్రం రూ.3,189 కోట్ల నిధులు మంజూరు చేసింది. భారత్‌నెట్‌ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందించనున్నారు. అలాగే సుమారు 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు నేరుగా హోమ్‌ ఫైబర్‌ కనెక్షన్లు ఇవ్వనున్నారు. దీంతో గ్రామీణ విద్యార్థులు, రైతులు, ప్రజలకు ఆన్‌లైన్‌ విద్య, వైద్య సేవలు, డిజిటల్‌ చెల్లింపులు, ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి.

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను మరింత విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది. ఇప్పటివరకు పట్టణాలకే ఎక్కువగా పరిమితమైన హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఇక పల్లెల్లోని ఇళ్లకు కూడా చేరువ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా భారత్‌నెట్ ప్రాజెక్టు కింద తెలంగాణకు రూ.3,189 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో పాటు సుమారు 3 లక్షల గ్రామీణ ఇళ్లకు నేరుగా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎలా అమలవుతుంది? గ్రామీణ ప్రజలకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఒకసారి డీటైయిల్డ్‌గా చూద్దాం. ముందుగా ఈ ప్రాజెక్టు ఉద్దేశం గురించి తెలుసుకుందాం. ఇప్పటి రోజుల్లో ఇంటర్నెట్ అనేది కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. చదువుల నుంచి ఉద్యోగాల వరకు, వైద్య సేవల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతి విషయంలోనూ ఇంటర్నెట్ కీలకంగా మారింది. అయితే పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, నెట్‌వర్క్ సమస్యలు ఉండటం ప్రధాన ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణకు రూ.3,189 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, నిధుల కోసం ప్రయత్నించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లలో సీఎం కూడా పాల్గొన్నారు. సీఎం, మంత్రి చొరవతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఫైబర్ నెట్‌వర్క్ విస్తరించనున్నారు. ఇందులో ఇప్పటికే తొలి విడత భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెయ్యి తొమ్మిది వందల నలభై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉన్న కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తారు. ప్రస్తుతం ఉన్న లీనియర్ నెట్‌వర్క్ విధానాన్ని రింగ్ టోపాలజీ విధానంలోకి అప్‌గ్రేడ్ చేయనున్నారు. అసలు ఈ రింగ్ టోపాలజీ అంటే ఏంటి? సాధారణంగా లీనియర్ నెట్‌వర్క్‌లో కేబుల్ ఒకే మార్గంలో అనుసంధానమై ఉంటుంది. ఆ మార్గంలో ఎక్కడైనా కేబుల్ తెగినా లేదా సాంకేతిక సమస్య వచ్చినా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగొచ్చు. అదే రింగ్ టోపాలజీలో కేబుల్‌ను వలయాకారంలో అనుసంధానిస్తారు. ఒక మార్గంలో సమస్య వచ్చినా మరో మార్గం ద్వారా కనెక్షన్ కొనసాగుతుంది. దీంతో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు తగ్గుతాయి. మరోవైపు రెండో విడతలో 10,787 గ్రామ పంచాయతీలకు కొత్తగా ఫైబర్ నెట్‌వర్క్ విస్తరించనున్నారు. కొత్తగా ఏర్పడిన మరో 36 గ్రామ పంచాయతీలను కూడా ఈ ప్రాజెక్టులో చేర్చనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొత్తగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు టెండర్లు కూడా పిలవనున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు మెరుగైన ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కేవలం గ్రామ పంచాయతీ కార్యాలయాలకే ఇంటర్నెట్ పరిమితం కాకుండా గ్రామీణ ఇళ్లకు కూడా నేరుగా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో సుమారు 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఒక్కో కనెక్షన్‌కు రూ.10 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. మొత్తంగా సుమారు 3 లక్షల గ్రామీణ ఇళ్లకు హోమ్ ఫైబర్ కనెక్షన్లు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. మరి ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల గ్రామీణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ముందుగా విద్యా రంగాన్ని తీసుకుంటే.. గ్రామాల్లో ఉండే విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు, డిజిటల్ స్టడీ మెటీరియల్, పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ కోచింగ్‌ను సులభంగా పొందవచ్చు. వైద్య రంగంలో టెలిమెడిసిన్ సేవల ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌లో వైద్యుల సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులకు వ్యవసాయ సమాచారం, ప్రభుత్వ పథకాలు, వాతావరణ వివరాలు మరింత సులభంగా అందుతాయి. అలాగే డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవలు కూడా గ్రామీణ ప్రజలకు చేరువవుతాయి. ఇక ఈ ప్రాజెక్టు అమలు కోసం తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్.. కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా ప్రాజెక్టును రాష్ట్ర ఆధారిత నమూనాలో అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిజిటల్ భారత్ నిధి, తెలంగాణ ప్రభుత్వం, బీఎస్ఎన్ఎల్, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ తదితర సంస్థల సమన్వయంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగనుంది. అయితే ఈ భారత్‌నెట్ పథకానికి కూడా ఓ నేపథ్యం ఉంది. దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలు, గ్రామాలకు డిమాండ్ ఆధారంగా హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో 2023 ఆగస్టు 4న కేంద్ర కేబినెట్ సవరించిన భారత్‌నెట్ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. గతంలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌గా ఉన్న నిధుల వ్యవస్థను ప్రస్తుతం డిజిటల్ భారత్ నిధిగా మార్చి, మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణకు ఉపయోగిస్తున్నారు. మొత్తానికి రూ.3,189 కోట్ల భారీ ప్రాజెక్టుతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 12,769 గ్రామ పంచాయతీలకు ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ, సుమారు 2.93 లక్షల కుటుంబాలకు హోమ్ ఫైబర్ కనెక్షన్ల ఏర్పాటు పూర్తయితే గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయం, ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలకు రూ. 7 వేల స్టైపెండ్

Follow Us