ఎవరికి పడితే వారికి ఆధార్‌ ఇచ్చేస్తున్నారా.. వీడియో..!

Updated on: Feb 25, 2025 | 2:33 PM

ఆధార్‌ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారా? ఆధార్‌ జిరాక్స్‌ను ఎవరికి పడితే వారికి ఇచ్చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే. మన చుట్టూ కనిపించకుండా సైబర్‌ నేరగాళ్లు మాటువేసి ఉన్నారనే సంగతి మర్చిపోవద్దు. ఒక్కసారి మీ ఆధార్‌ డీటెయిల్స్‌ సైబర్‌ కేటుగాళ్లకు చిక్కాయా.. ఇక అంతే సంగతులు. క్షణాల్లో మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ కావడం ఖాయం అంటున్నారు నిపుణులు. చాలా మంది ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే ఈ-ఆధార్‌ ను గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తుంటారు. దానిపై ఫోన్‌ నంబర్‌, పుట్టిన తేదీ ఉంటుంది. ఇది సైబర్‌ నేరగాళ్లకు చిక్కితే ఇక అంతే సంగతులు.

ఈ-ఆధార్‌ ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి, నిధులు లూటీ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబరుతో కొత్త సిమ్‌ కార్డు సృష్టించి, అసలు సిమ్‌కు బ్యాంక్‌ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్‌ చేస్తారు. వారు సృష్టించిన సిమ్‌కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత అన్‌ బ్లాక్‌ చేసి, అసలు సిమ్‌కార్డును పునరుద్ధరిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు పోయిన సంగతి బాధితులకు కూడా తెలియదు.ఆధార్‌ కార్డ్‌ను జిరాక్స్‌ తీసుకునేటప్పుడు ప్రింట్ సరిగా రాలేదని అక్కడే పడేస్తుంటారు. అయితే అలాంటి పొరపాటు మాత్రం చేయొద్దంటున్నారు నిపుణులు. ప్రింట్‌ సరిగా రాని జిరాక్స్‌ కాపీని ఇంటికి తీసుకొచ్చి ధ్వంసం చేయాలని సూచిస్తున్నారు. తెలియని వారికి ఆధార్‌ కార్డులను మెయిల్స్, వాట్సప్‌ చేయవద్దు. చాలా వరకు చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్క్‌డ్‌ ఆధార్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.