దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌! ధర రూ. 47 వేలు

నోటిని క్లీన్ చేసుకోవడానికి అసలైన గేమ్ ఛేంజర్ వచ్చేసింది! ఇకపై బ్రష్ చేసుకునేటప్పుడు ఫ్లాసింగ్ గురించి  టెన్షన్ అక్కర్లేదు. ఈ ఏఐ టూత్‌బ్రష్‌లో ఉన్న కెమెరా మన నోటినంతటినీ ఒక రేంజ్‌లో స్కాన్ చేస్తూ, ఆటోమేటిక్‌గా డెంటల్ ఫ్లాసింగ్ కూడా చేసేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, నెక్స్ట్ లెవెల్ ఓరల్ కేర్ అందిస్తుంది!

దంతాల మీద పాచి, గారె ఇట్టే తొలగించే ఏఐ టూత్‌బ్రష్‌! ధర రూ. 47 వేలు
Ai Toothbrush With Camera Internet Stunned

Updated on: Sep 03, 2026 | 12:29 PM

ముఖ సౌందర్యంలో దంతాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముత్యాల లాంటి తెల్లటి దంతాలు మనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పళ్లు పసుపు రంగులోకి మారడం, చిగుళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుండగా, క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం, వేళాపాళా లేకుండా తినడం, టీ-కాఫీలు అధికంగా సేవించడం, అలాగే ధూమపానం వంటి అలవాట్లు ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి

వాక్యూమ్‌ క్లీనర్లు, బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్‌ల తయారీకి పేరొందిన  ‘డైసన్‌’  సంస్థ  ఏఐ స్మార్ట్ టూత్ బ్రష్ తీసుకొచ్చింది. ‘కెమెరాజెట్‌’ అనే ఈ టూత్‌బ్రష్‌ను ఇటీవల పారిస్‌ మార్కెట్లో విడుదల చేశారు.  ఏఐ టెక్నాలజీ, మెషిన్‌ లెర్నింగ్‌తో ఇది పనిచేస్తుంది.  ఈ డివైజ్ కేవలం బ్రష్ చేయడానికే పరిమితం కాకుండా ఒకే సమయంలో బ్రషింగ్, ఫ్లాసింగ్ (Flossing) రెండింటినీ పూర్తి చేసేలా రూపుదిద్దుకుంది. అంటే.. నోటి శుభ్రతలో పంటి సందుల నడుమ పేరుకుపోయే ప్లాక్, ఆహార వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా డైసన్ ఇంజినీర్లు దీనిని డిజైన్ చేశారు.

 


టూత్‌బ్రష్ హెడ్‌లో 100 పిక్సెల్స్ మ్యాక్రో కెమెరాను అమర్చారు. ఇది సెకనుకు 28 చిత్రాలను క్యాప్చర్ చేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దంతాల మధ్య ఖాళీలను గుర్తిస్తుంది. ఆటోమేటిక్‌గా ఒక చిన్న జెట్ ద్వారా మౌత్‌ వాష్ ను స్ప్రే చేసి  ప్లాక్ (పాచి)ని తొలగిస్తుంది. ఇది వైఫై, బ్లూటూత్ ద్వారా ‘మైడైసన్’  యాప్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. యాప్ ద్వారా లైవ్ వ్యూ చూస్తూ క్లీనింగ్ చేసుకోవచ్చు.  సుమారు ఆరు సంవత్సరాల రీసెర్చ్‌ తర్వాత దీన్ని రూపొందించారు. దీని అంతర్జాతీయ ధర $499 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.47,000 గా ఉంది. ప్రస్తుతానికి ఇది గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది. 

దంతాలు తోముకున్న తర్వాత విడిగా ఫ్లాసింగ్ చేయడం లేదా మౌత్‌వాష్ వాడటం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. కెమెరాజెట్ పరికరం ఈ రెండింటినీ కలిపి ఒకేసారి చేస్తుంది. ఈ పరికరాన్ని వాడటం వల్ల చిగుళ్ల వ్యాధులు, పిప్పిపళ్లు వంటి దంత సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  ఈ కొత్త పరికరానికి సంబంధించిన వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడంతో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us