“భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే బూడిద మిగలడం గ్యారెంటీ”

|

Sep 20, 2023 | 10:56 AM

కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌కు పొరపాటున ఓటేస్తే ఆరు కష్టాలు గ్యారెంటీ.. ఐదేళ్లకు ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం గ్యారంటీ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు పక్కా గ్యారెంటీ, తాగునీటి కష్టాలు పక్కా గ్యారెంటీ, రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్‌లో నిలబడటం పక్కా గ్యారెంటీ, రైతు బంధు, దళిత బంధు పథకాలను ఎగ్గొట్టడం పక్కా గ్యారెంటీ.. రాజకీయ అస్థిరతతో రాష్ట్రాన్ని కుదేలు చేయడం పక్కా గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ గ్యారెంటీలపై విమర్శలు చేశారు‌.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. పార్టీ నేతల మధ్య మాటలు వార్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్తుంది.  మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి, బకాసురులు గద్దెనెక్కితే రైతు బీమా, ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అంటూ తీవ్ర కామెంట్స్ చేశారు. ఢిల్లీ కీలుబొమ్మలు అధికారం చేపడితే ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టుపెట్టడం గ్యారెంటీ అని పేర్కొన్నారు. చేతకాని చేవలేని వాళ్లకు పగ్గాలు ఇస్తే పల్లె పల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ అంటూ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లను నమ్ముకుంటే ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమ స్థాయికి పడిపోతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలను నమ్మవద్దని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్లకు డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు.. కాంగ్రెస్ నేతలు కుంభకోణాల ద్వారా భారీగా డబ్బు సంపాదించారని, దానిని ప్రజలు స్వీకరించి బీఆర్‌ఎస్‌కే ఓట్లు వేయాలన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Sep 20, 2023 10:45 AM