Big News Big Debate: ఏపీలో మళ్లీ పొత్తులపై రచ్చ.. ఢిల్లీలో పవన్ కామెంట్స్‌తో హీటెక్కిన చర్చ

|

Jul 19, 2023 | 7:00 PM

ఏపీలో మళ్లీ పొత్తులపై రచ్చ మొదలైంది. NDA సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌.. 2014 నాటి పొత్తులే రిపీట్‌ అవుతాయంటూ చేసిన ప్రకటన రాజకీయంగా కాక రేపుతోంది. మేం చెప్పిందే నిజమైందని వైసీపీ ఎటాక్‌ మొదలుపెట్టింది. అయితే పొత్తులపై అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి మౌనవ్రతం పాటిస్తున్నాయి టీడీపీ, బీజేపీ.

పవన్‌ మనసులో మాట ఢిల్లీ వేదికగా బయటపెట్టారు. ఇప్పుడే కాదు చాలాకాలంగా ఆయన పొత్తులపై పదేపదే ప్రస్తావిస్తున్నారు. టీడీపీతో కలిసివెళ్లాలని బీజేపీని కూడా కలుపుకుని పోవాలని బలంగా కోరుకుంటున్నారు జనసేన అధ్యక్షులు పవన్. కానీ అవతల నుంచే రియాక్షన్‌ కనిపించడం లేదు. టీడీపీ ఎక్కడా స్పందించడం లేదు. ఇటీవల నడ్డా, అమిత్‌షాతో సమావేశం అయిన చంద్రబాబు కూడా అలియన్స్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇక పొత్తులపై హైకమాండ్‌ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి. సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని.. త్వరలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం అవుతామని ప్రకటించారు.