KTR: ‘రేవంత్ ఏం తిట్టినా, సహనం కోల్పోవద్దని కేసీఆర్ నాకు చెప్పారు’
రేవంత్ రెడ్డి విమర్శలపై సంయమనం పాటించాలని కేసీఆర్ తనకు సూచించినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, దిగజారుడు ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోయారని, పార్టీ నాయకత్వాలు తమ సభ్యులను నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దిగజారుడు రాజకీయాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ తనకు వ్యక్తిగతంగా సలహా ఇచ్చినట్లు కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి నిరాశలో ఉన్నాడని, ఓడిపోతున్నాడని, అందుకే సహనం కోల్పోవద్దని, హుందాగా, సంయమనంతో మాట్లాడాలని కేసీఆర్ తనకు సూచించారని తెలిపారు. ఎదుగుతున్న నాయకుడికి ఇది ప్రాథమిక లక్షణమని కేసీఆర్ అన్నట్లు కేటీఆర్ వివరించారు. రాజకీయ పార్టీల్లో నాయకత్వం సక్రమంగా ఉంటే, మిగతావారు కూడా హుందాగా వ్యవహరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో మహేష్ గౌడ్, బీజేపీలో రామచంద్రరావు వంటి అధ్యక్షులు తమ పార్టీ సభ్యులను నియంత్రించాలని కోరారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం పట్ల ప్రజలు విసిగిపోయారని, నాయకులను క్యారికేచర్‌లుగా, అవినీతిపరులుగా చూస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
