iSmart News: కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం

Edited By:

Updated on: Jun 30, 2026 | 7:35 PM

ఖమ్మం జిల్లా దానవాయిగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల మరమ్మతు పనులకు సంబంధించి బిల్లులు చెల్లించనందుకు ఆగ్రహించిన ఓ కాంట్రాక్టర్ బడికి తాళం వేశాడు. 21 లక్షల విలువైన పనులు చేసినా బకాయిలు రాకపోవడంతో ఆవేదనకు గురైన కాంట్రాక్టర్ పోలీసుల జోక్యంతో తాళం తీశాడు.

ఖమ్మం మండలం దానవాయిగూడెం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చేపట్టిన మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించనందుకు నిరసనగా ఓ కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేయడం సంచలనం సృష్టించింది. దాదాపు 21 లక్షల రూపాయల ఖర్చుతో పాఠశాలలో బాత్‌రూమ్‌ల నిర్మాణం, గదుల మరమ్మతులు, కొత్త లైట్లు, ఫ్యాన్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు కాంట్రాక్టర్ తెలిపాడు. సొంత పైసలు, అప్పులు చేసి పనులు పూర్తి చేసినా, సంవత్సరాలు గడిచినా బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఆందోళన చెందాడు. తనకు 21 లక్షలు అవసరం లేదని, తాను పెట్టిన 16 లక్షల్లో వచ్చిన 10 లక్షలు పోగా మిగిలిన 6 లక్షలు ఇప్పిస్తే చాలని అధికారులను వేడుకున్నాడు. అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో నిన్న ఆగ్రహంతో బడికి తాళం వేశాడు. ఈ ఘటనపై పాఠశాల ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేయగా, కాంట్రాక్టర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను చావడానికైనా సిద్ధమేనని వాపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంట్రాక్టర్‌తో మాట్లాడి తాళం తీయించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పేద కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులకు ఈ ఘటన అద్దం పడుతోంది.

Follow Us