నిన్న శబరిమల.. నేడు కంచి.. దేవుళ్ళకే శఠగోపం పెడుతున్న కేటుగాళ్లు
ప్రసిద్ధి చెందిన కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది. భక్తుల దోష నివారణకు ప్రసిద్ధి చెందిన బంగారు, వెండి బల్లుల విగ్రహాల తాపడాలను పునరుద్ధరణ పనుల పేరుతో మార్చేశారనే ఆరోపణలు రావడంతో కలకలం రేగింది. ఇక్కడ దేశం నలమూలల నుంచే కాకుండా.. విదేశీ భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు.
ఇదే ఆలయంలోని అత్తి వరదరాజ పెరుమాళ్ స్వామి 40 ఏళ్లకోసారి భక్తులకు దర్శనమిస్తుంటారు.. 2019లో 40 రోజులపాటు భక్తులకు దర్శనం అవకాశం దొరికింది. మళ్లీ 2059లో స్వామి దర్శనం చేసుకునే అవకాశముంటుంది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆలయంలో బంగారం, వెండి మాయం అయిన ఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇటీవల కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధిలో కూడా బంగారం తాపడం మాయమైన ఘటన వివాదం కావడంతో.. ఆ ఘటనపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.. అయ్యప్ప సన్నిధిలో ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తాపడంలో బంగారం కరిగించేసి మాయం చేశారన్న ఆరోపణ రావడంతో అక్కడ విచారణ జరుగుతోంది. ఇప్పుడు కంచిలోనే వరదరాజ పెరుమాళ్ ఆలయంలో స్వామివారి దర్శనం తర్వాత అత్యంత ముఖ్యమైన బంగారు వెండి బల్లుల దర్శనం అనేది ఇక్కడ ప్రధానం. బంగారు వెండి తో చేసిన తాపడాలని.. ఆ విగ్రహాలకు కవచంగా చేసి దశాబ్దాలుగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు బంగారు బల్లి, వెండి బల్లిని దర్శించుకోకుండా బయటికి వెళ్లరు. ఇటీవల వీటి మరమ్మతుల పేరుతో తాపడాలను తీసి వాటి స్థానంలో పూత పూసిన నాసిరకం నకిలీ తాపడాలని ఉంచినట్లు అనుమానం రావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వందేళ్ళకు పైబడిన పురాతనమైన బంగారం తాపడాలు కావడంతో వీటికి మార్కెట్లో మంచి విలువ ఉంటుంది. ఆలయంలో దశాబ్దాలుగా నిత్య కైంకర్యాలు జరిగే లోహాలకు విశేషమైన శక్తి ఉంటుందని నమ్మేవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి బంగారం విలువ.. మార్కెట్ విలువ కంటే పదింతలు ఎక్కువగా వెచ్చించి కొనుగోలు చేయాలనుకునేవారూ చాలామంది ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ బంగారాన్ని అక్కడి నుంచి మాయం చేసి ఆ స్థానంలో బంగారం పూత పూసిన కవచాలను అక్కడ ఉంచారన్న అభియోగం ఉంది. తమిళనాడులో విగ్రహాల చోరీకి సంబంధించి దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. ఆ విభాగం డిసిపి సంపత్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతోంది. ఏళ్ల నుంచి భక్తులు తాకడంతో బాగా అరిగిన బంగారం, వెండి బల్లుల విగ్రహాలకు 6 నెలల క్రితం మరమ్మతు పనులు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: దిగి వచ్చిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
