BJP – Janasena: ఏపీలో ఏమిటీ పొత్తుల కన్ఫ్యూజన్..? బీజేపీ-జనసేన పార్టీల పొత్తు ఉన్నట్టా..లేనట్టా..?

|

Oct 12, 2023 | 9:52 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ చాలా రక్తికట్టిస్తున్నాయి. ఓవైపు ప్రధాన ప్రతిపక్షం వివిధ కేసులతో సతమతం అవుతుంటే.. మరోవైపు జగన్‌ను ఢీకొడతామని జనసేనాని పవన్ కల్యాణ్ గర్జిస్తున్నారు. అయితే, తానొక్కడినే కాదని, టీడీపీ, వామపక్ష సీపీఐతో కలిసి జగన్‌పై పోరాటం చేస్తానంటూ ఎన్నికల సమరశంఖం పూరించారు. అయితే, ఇక్కడే చిన్న కన్‌ఫ్యూజన్ నెలకొంది. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ వచ్చారు.

Andhra Pradesh: ఏపీలో పొత్తులపై గమ్మత్తు రాజకీయం నడుస్తోంది. పవన్ చూస్తే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి.. కార్యాచరణ ప్రకటిస్తున్నారు. కానీ మిత్రపక్షమైన బీజేపీని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకసారి బీజేపీతోనే ఉన్నా అంటారు. ఇంకోసారి టీడీపీ, జనసేనతో కలిసి.. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నా అంటారు. కానీ బీజేపీ, టీడీపీకి రాజకీయ లింక్ లేదు. తాజాగా వైజాగ్‌లో టీడీపీ-జనసేన-సీపీఐ మూడు పార్టీల ఉమ్మడి సమావేశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడమే అసలు ట్విస్ట్‌.

ఇటీవల గుంటూరులో జరిగిన జనసేన ర్యాలీకి కూడా బీజేపీకి ఇన్విటేషన్‌ లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏపీలో ఏయే పార్టీల మధ్య పొత్తు ఉంది. ఏయే పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయనేది పెద్ద కన్ఫ్యూజన్‌గా మారింది. ముఖ్యంగా పవన్ పొలిటికల్ యాక్షన్‌తో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయోమయంలో పడ్డారు. అందుకే పొత్తులపై ఇక తేలాల్సిందే.. లెక్క తేలాల్సిందే.. అంటోంది కమలం పార్టీ

కొద్ది రోజుల క్రితమే కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర బీజేపీ.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు జనసేన వైఖరిని అధిష్టానం ముందుకి తీసుకెళ్లారు ఆ పార్టీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి. దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతుందనేది ఆసక్తిగా మారింది.

అయితే ఎన్డీయే కూటమిలో ఉండగా టీడీపీతో జతకట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. బీజేపీతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నారా.. అంటే పొత్తు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనీ.. బీజేపీ దృష్టికి ఎప్పుడో ఈ విషయాన్ని తీసుకెళ్లా అంటున్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. వైసీపీని ఓడించడమే తన టార్గెట్ అనీ.. దాని కోసం ఏమైనా చేస్తా అని అంటున్నారాయన. బీజేపీ నేతలు G20 కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల తానే లీడ్ తీసుకున్నట్లు చెప్పారు. పైగా తమతో బీజేపీ కలిసి వస్తుందనే ఆశాభావం కూడా ఉందంటున్నారు.

టీడీపీ, జనసేనతోపాటు లెఫ్ట్‌ పార్టీలు కూడా కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేపట్టాయి.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్నారు 3 పార్టీల నేతలు. లెఫ్ట్‌ నేతలు కూడా జనసేనతో కలిసిన పరిస్థితుల్లో ఈ కూటమిలో బీజేపీ ఉంటుందా.. లేదా.. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.. వీటిపై చర్చించేందుకే కొద్ది రోజుల క్రితం పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతానికి పవన్‌ టెక్నికల్‌గా ఎన్డీయేలో ఉన్నా.. లోకల్‌గా టీడీపీతో కలిసి వెళ్తున్నారు. ఈ కన్ఫ్యూజన్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేలా ఇప్పుడు ఢిల్లీలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు కొనసాగించడమా.. లేక తెగతెంపులు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడమా.. అనేది బీజేపీ నిర్ణయం తీసుకోనుంది.

Published on: Oct 12, 2023 09:43 AM