దేశంలో క్యాన్సర్ మరణ మృదంగం.. దడ పుట్టిస్తున్న ICMR నివేదిక
ICMR షాకింగ్ నివేదిక ప్రకారం, భారతదేశంలో పురుషులలో నోటి క్యాన్సర్ కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. పొగాకు, మద్యం ప్రధాన కారణాలు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ఆందోళన కలిగిస్తుండగా, గర్భాశయ క్యాన్సర్ తగ్గుముఖం పట్టింది. అయితే, అనేక క్యాన్సర్ కేసులు ఆలస్యంగా గుర్తించబడుతున్నాయి. 2045 నాటికి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నివేదిక ప్రజల్లో అవగాహన, అలవాట్లలో మార్పుల అవసరాన్ని నొక్కి చెబుతోంది.
భారతదేశంలో సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న ఒక వ్యాధి గురించి ఇటీవల ఒక దిగ్భ్రాంతికరమైన నివేదిక బయటకు వచ్చింది. మనం ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నామా? కానీ మన అలవాట్లు మనల్ని మృత్యువు వైపు నడిపిస్తున్నాయా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR చేసిన తాజా అధ్యయన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో పురుషులలో ‘నోటి క్యాన్సర్’ కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. అసలు G20 దేశాల్లో భారతదేశం పరిస్థితి ఏంటి? మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ గణాంకాలు ఏం చెబుతున్నాయి? 2045 నాటికి మన దేశ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ఇప్పుడు తెలుసుకుందాం. “ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ ఎపిడెమియాలజీ (ICMR-NINE) ఇటీవల ఒక అధ్యయనాన్ని చేపట్టింది. 11 ప్రధాన G20 దేశాల డేటాను విశ్లేషించగా, భారతదేశంలో పురుషులలో నోటి క్యాన్సర్ కేసులు ఏటా 1.20 శాతం చొప్పున పెరుగుతున్నట్లు తేలింది. చైనాలో చూసుకుంటే 1.10%, కెనడాలో 0.94%, అమెరికాలో 0.57% పెరుగుదల ఉంది. అంటే ఆయా దేశాల కంటే భారత్‌లోనే ఎక్కువ శాతం నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాథుర్ చెప్పిన దాని ప్రకారం పొగాకు ఉత్పత్తులైన గుట్కా, పాన్ మసాలా, ఖైనీ వంటి పొగలేని పొగాకు పదార్థాల వినియోగం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అంతే కాదు.. మితిమీరిన మద్యపానం కూడా క్యాన్సర్ కణాల వృద్ధికి దోహదపడుతుందనేది ఆ నివేదిక సారాంశం. ఇక వక్క నమలడం అనే అలవాటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో లోతుగా పాతుకుపోయింది. ఈ అలవాట్లు చిన్న వయసులోనే అంటే టీనేజ్‌లోనే ప్రారంభం కావడం అత్యంత ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. మహిళల విషయానికి వస్తే, భారతదేశంలో రెండు ప్రధాన క్యాన్సర్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో ఒకటి రొమ్ము క్యాన్సర్ అయితే మరొకటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ అనేది అధ్యయనం చేసిన మొత్తం 11 దేశాల్లోనూ మహిళల్లో నంబర్ వన్ శత్రువుగా తేలింది. భారతదేశంలో దీని పెరుగుదల రేటు ఏటా 1.83 శాతంగా ఉంది. దక్షిణ కొరియాలో ఇది అత్యధికంగా 5.07 శాతంగా ఉండటం గమనార్హం. ఇక..గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ విషయానికొస్తే భారత్‌కు ఒక శుభవార్తగానే చెప్పొచ్చు. త కొన్ని దశాబ్దాలుగా తీసుకుంటున్న చర్యల వల్ల మన దేశంలో ఈ క్యాన్సర్ కేసులు ఏటా 4.19 శాతం తగ్గుతున్నాయి. స్క్రీనింగ్ పెరగడం, HPV వ్యాక్సినేషన్ పట్ల అవగాహన రావడం దీనికి కారణం. అయితే, కేసుల సంఖ్య తగ్గుతున్నా, వ్యాధి మొత్తం భారం ఇంకా దేశంలో అధికంగానే ఉంది. ఈ అధ్యయనంలో బయటపడిన మరో చేదు నిజం ఏమిటంటే, భారతదేశంలో నోటి క్యాన్సర్ కేసులు ముదిరిన దశలో మాత్రమే బయటపడుతున్నాయి. మొదటి లేదా రెండవ దశలో గుర్తించగలిగితే చికిత్స సులభం, ఖర్చు తక్కువ. కానీ చివరి దశలో గుర్తించడం వల్ల ప్రాణాపాయం పెరగడమే కాకుండా, చికిత్స అత్యంత ఖరీదైనదిగా మారుతోంది. గణాంకాలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఐసీఎంఆర్ అంచనాల ప్రకారం 2024లో భారతదేశంలో కొత్తగా 15.6 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. 8.74 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది పురుషులలో 1.13 లక్షల కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉంది. మనం గనుక ఇప్పుడే మేల్కొనకపోతే, 2045 నాటికి ఏటా కొత్త కేసుల సంఖ్య 24.6 లక్షలకు చేరుకుంటుంది. క్యాన్సర్ అనేది కేవలం ఒక వ్యాధి మాత్రమే కాదు, అది ఒక కుటుంబం మొత్తాన్ని ఆర్థికంగా, మానసికగా కుంగదీస్తుంది. ప్రభుత్వం స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది, వ్యాక్సినేషన్ అందిస్తోంది. కానీ, వ్యక్తిగత మార్పు లేకుండా ఏదీ సాధ్యం కాదు. పొగాకు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. నోటిలో ఏవైనా మార్పులు కనిపించినా, రొమ్ములో గడ్డలు ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాడు “మీసాల పిల్ల” అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
