Ice Cubes: “వితౌట్ ఐస్” అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
స్టార్ హోటల్స్ అయినా కాకా హోటళ్లయినా.. శ్రీమంతుడి పెళ్లయినా, మన గల్లీ ఫంక్షనయినా ఖర్చొక్కటే తేడా. కానీ ఒక్క ప్రొడక్ట్ మాత్రం సేమ్ టూ సేమ్. అదే చల్లచల్లని ఐస్. అది కూల్‌గానే ఉంటుంది.. కానీ దాని వెనుక నిజాలే హారిబుల్‌గా ఉంటాయి. అనుమానమే లేదు.. కల్తీ పర్వంలో ఇదో కోల్డ్ మర్డర్ కల్తీబేరం.వాళ్లు చెప్పే మాటలు నమ్మి ఆర్డర్ ఇస్తే ఐస్‌మీద కాలేసి జారినట్లే. పైకి అంతా స్వచ్ఛమైన ఐస్..లోపలంతా బుస్సే.
ఎర్రటి ఎండలో.. చల్లటి ఐసు ముక్కలేసుకుని.నీళ్లు.. కూల్ డ్రింక్.. లస్సీ.. జ్యూస్ .ఇలా ఏదో ఒకటి పుచ్చుకుంటే.. ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇక్కడ సేదతీర్చేది నీళ్లో, కూల్‌డ్రింకో..లస్సీనో.. మజ్జిగో కాదు.. ఐసుముక్కలు. ఐసు ముక్కవేసుకోగానే టోటల్ ప్రొడక్ట్ టేస్టే మారిపోద్ది. అంతటి మహత్తు.. గమ్మత్తు ఆ ఐసులో ఉంది…ఎంతవేడిలో ఉన్నా మనల్ని ఐస్ చేస్తుంది. అలాంటి ఐసు ముక్క.. ఐసు కాదని తేలితే..అదో కల్తీదని.. దాని తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుందని తెలుసా.. అంత ఛండాలం ఆ ఐసుముక్కల్లో ఉంటుంది..
స్వచ్ఛమైన ఐస్‌క్యూబ్‌లు. అన్న బోర్డులు చాలా ఆర్భాటంగా దర్శనమిస్తాయి కానీ..లోపలకెళ్తే కానీ అసలు బండారం తెలియదు. ఇక్కడ ఆర్వో ప్లాంటు గాడిదుగుడ్డూ గట్రా ఏమీలేవు. ఐస్‌క్యూబ్‌లకు వాడే నీళ్లు బోరునుంచి తోడేసిన బురద నీరే..ఆ బురద నీటితోనే ఐస్‌క్యూబ్స్ రెడీ చేస్తున్నారు.
నీళ్ల దందానే కాదు.. ఆ నీళ్లని గడ్డకట్టించడం కూడా గ్రేటర్ సిటీలో పెద్ద ఫార్స్. రోజూ వేల కిలోల కల్తీ ఐస్‌క్యూబ్‌లు తయారుచేసి సొమ్ము చేసుకుంటున్నారు ఐస్‌ప్లాంట్ల నిర్వాహకులు. ఆర్వో నీటితో ఐస్‌క్యూబ్‌లు తయారు చేస్తే ఎలాంటి సమస్యలుండవుగానీ.. దాన్ని కేవలం డిస్‌ప్లే కోసమే ఉంచేసి దొరికిన నీటితో పని కానిచ్చేస్తున్నారు. ఆర్డర్లిచ్చేవారికి, చూసే కస్టమర్లకి అక్కడ ఆర్వో ప్లాంట్ ఆర్భాటంగా కనిపిస్తుంది. కానీ ఐస్‌క్యూబుల్లో వాడేది అందులో ఫిల్టరయ్యే నీరుకాదు. కానీ వాటికి ప్యూరిఫైడ్ ఐస్‌క్యూబ్‌ల ట్యాగ్ తగిలించేస్తున్నారు.
కస్టమర్లని నమ్మించేందుకు, ఎప్పుడన్నా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడో ఆర్వో ప్లాంట్ రన్నింగ్‌లో ఉంటుంది. మిగిలిన సమయాల్లో అది ఆఫ్ అయిపోతే బోరు మోటారు ఆన్ అవుతుంది. అనుమానంతో ల్యాబ్‌కి తీసుకెళ్లి తనిఖీ చేసేలోపు కరిగిపోతాయన్న నమ్మకం. మిలమిలా మెరిసిపోతుంటే ఎవరూ అనుమానించరన్న కాన్ఫిడెన్స్. ఆర్వోతో ఫిల్టర్ అయిన నీళ్లతో ఐస్‌క్యూబ్‌లు తయారుచేయాలంటే ఖర్చు పెరుగుతుంది. ఆర్వో ప్లాంట్ కెపాసిటీ 2వేలనుంచి 5వేల లీటర్లదాకా ఉంటుంది. ఒక్క వాటర్ ప్లాంట్ ఎంతలేదన్నా రోజూ 10టన్నుల ఐస్‌క్యూబ్స్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఇంత క్వాంటిటీని మినరల్ వాటర్‌తో తయారుచేస్తే గిట్టుబాటు కాదని, బోరు నీళ్లతోనే గడ్డకట్టించేస్తున్నారు. గుట్టుగా కానిచ్చేస్తున్నారు.
మొదట హిమాయత్‌నగర్ వాటర్ ప్లాంట్‌కి వెళ్లింది టీవీ9. అక్కడ ఆర్వో ప్లాంట్ వాటర్‌తో తయారయ్యే ఐస్‌క్యూబ్‌లు మాత్రమే దొరుకుతాయి. తక్కువ ధరకు కావాలంటే చలో చంపాపేట్ అన్నారు ఆ ప్లాంట్ ఓనర్. చంపాపేట్‌కి వెళ్తే బయటపడింది చల్లటి ఐస్ వెనుక సైలెంట్‌గా సాగుతున్న కల్తీ దందా.
ఐస్‌క్యూబ్‌లే కాదు.. పెద్దపెద్ద ఐస్ బ్లాక్‌లు కూడా కలుషిత నీటితోనే తయారవుతున్నాయి. పూర్తిగా చెడిపోయి చిలుం పట్టిన ఐరన్ బ్లాకుల్లో ఉప్పునీటితో తెల్లటి ఐస్ బ్లాక్స్ తయారవుతున్నాయి. కలుషిత నీటికి తోడు చిలుం చేరిన ఐస్ బ్లాక్స్‌నే మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు తినే పుల్ల ఐసులు వీటితోనే తయారవుతుంటాయి. అవే జ్యూసుల్లో కలుస్తున్నాయి. ఐస్‌క్యూబ్స్, ఐస్‌బ్లాక్స్ తయారుచేసే ప్లాంట్లు హైదరాబాద్ నగరంలో పాతికదాకా ఉన్నాయి. అందులో దాదాపు సగానికి పైగా ప్లాంట్లు ఆర్వో సెటప్ చూపిస్తూ.. అపరిశుభ్రమైన నీటితోనే ఐస్ క్యూబ్స్ మార్కెట్‌లోకి వదులుతున్నాయి. మరి ఈసారి బయట ఏదైనా షుగర్ కేన్ జ్యూస్ ఆర్ ఇంకేదైనా జ్యూస్ తాగినప్పుడు ”వితౌట్ ఐస్” అని చెప్పడం మరిచిపోతారా?
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.