ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరి లంకేష్ వర్ధంతి సందర్భంగా నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. డియర్ గౌరి, నిన్ను చాలా మిస్ అవుతున్నా. నిన్ను చంపిన వాళ్ళు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే, ప్రజల కోసం గొంతెత్తిన వాళ్ళు జైళ్ళలో మగ్గిపోతున్నారు. నీ గొంతను మేము ఎప్పటికీ మూగబోనివ్వమని ప్రమాణం చేస్తున్నాం. మేము నిన్ను పాతిపెట్టలేదు, విత్తనంగా నాటాం అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఎనిమిదేళ్ళ క్రితం 2017 సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన నివాసం వద్ద గౌరి లంకేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ముసుగు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. సమాజంలోని అసమానతలు, మూఢనమ్మకాలు, మతతత్వానికి వ్యతిరేకంగా తన దినపత్రిక ద్వారా నిర్భయంగా గళమెత్తిన గౌరి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గౌరి హత్య వెనుక బలమైన కారణాలు ఉన్నాయని ఆమె సన్నిహితులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఒక ప్రముఖ దేవాలయానికి చెందిన మతాధికారి అక్రమాలపై ఆమె కీలక ఆధారాలు సేకరిస్తున్నారని, ఆ విషయాలను బయటపెట్టకుండా ఉండేందుకే ఈ హత్య జరిగి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య తర్వాత ఆమె ఆఫీసులోని ల్యాప్‌టాప్‌ను ద్వంసం చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ హత్యపై దేశవ్యాప్తంగా ఐయాం గౌరి పేరుతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లివిరిశాయి. కేసును విచారించిన పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. అయితే ఘటన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నిందితులకు ఇంతవరకు శిక్ష పడకపోవడం గమనార్హం. న్యాయం కోసం గౌరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
