నా పోస్టుపై ఇంతగా చర్చించడం ఆనందంగా ఉంది

Updated on: Nov 22, 2025 | 11:32 AM

అపోలో వైస్ చైర్‌పర్సన్ ఉపాసన ఇటీవల పోస్ట్ చేసిన అండం ఫ్రీజింగ్, కెరీర్-కుటుంబ సమతుల్యత గురించిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. సరైన భాగస్వామి, ఆర్థిక స్థిరత్వం కోసం వేచి చూడటం, పిల్లల పుట్టుకపై మహిళల నిర్ణయాధికారంపై ఆమె ప్రశ్నలు సంధించారు. తన వ్యక్తిగత జీవితం (27 ఏళ్ల వయసులో వివాహం, 29 ఏళ్ల వయసులో అండం ఫ్రీజింగ్, 36 ఏళ్ల వయసులో మొదటి సంతానం) ఉదాహరణగా చూపి, మహిళల హక్కులను నొక్కిచెప్పారు.

అపోలో వైస్‌ చైర్‌పర్సన్‌, హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఇటీవల సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జోహో సీఈఓ శ్రీధర్ వెంబు లాంటి ప్రముఖులు సహా ఎంతోమంది నెటిజన్లు ఉపాసన పోస్టుపై స్పందించారు. కొందరు ఉపాసనను విమర్శించగా.. మరికొందరు మద్దతుగా కామెంట్లు పెట్టారు. దీనిపై రియాక్ట్‌ అయిన ఉపాసన తాజాగా మరో పోస్ట్‌ పెట్టారు. తన పోస్టుపై ఆరోగ్యకర చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు తన పోస్టుపై స్పందించిన వారికి థాంక్స్‌ చెబుతూ.. పలు ప్రశ్నలు సంధించారు. సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?, పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా? అంటూ పలు ప్రశ్నలను సంధించారు. అమ్మాయిలు ముందుగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత వివాహం చేసుకోవాలని, త‌న‌కు 27 ఏళ్ల వ‌య‌సులో పెళ్లి జ‌రిగింద‌ని, త‌న ఇష్ట‌పూర్వ‌కంగా జ‌రిగింద‌ని తెలిపారు. 29 ఏళ్ల వ‌య‌సులో వ్య‌క్తిగ‌త‌, ఆరోగ్య కార‌ణాల దృష్ట్యా త‌న అండాల‌ను ఫ్రీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, 36 ఏళ్ల వ‌య‌సులో తన‌కు తొలి సంతానం క‌లిగింద‌ని, 39 ఏళ్ల వ‌య‌సులో క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌నున్న‌ట్లు ఉపాస‌న త‌న పోస్టులో తెలిపారు. పెళ్లి, కెరీర్ మ‌ధ్య పోటీ స‌హ‌జ‌మే అని, కానీ నిండు జీవితంలో అవి రెండు ముఖ్య‌మే అని, అయితే తాను ఆ రెండింటికి టైం ఫిక్స్ చేసుకున్నాన‌ని, త‌న హ‌క్కును తాను వినియోగించుకున్న‌ట్లు ఉపాస‌న పేర్కొన్నారు. అందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.మరింతమంది మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకువచ్చేందుకు అందరం కలిసి పనిచేద్దామని ఆమె పిలుపునిచ్చారు.