Thalapathy Vijay: ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

Updated on: May 06, 2026 | 4:58 PM

అనుభవరాహిత్యం, సవాళ్లు చుట్టుముట్టినా, సినీ నటుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. కరూర్ ఘటన, వ్యక్తిగత వివాదాలు, సినిమా కష్టాలను అధిగమించి, ఆయన టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. బలమైన ఫ్యాన్ బేస్, ప్రజా సేవ, వినూత్న ప్రచారం విజయానికి దోహదపడ్డాయి, ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యే అవకాశాలను బలోపేతం చేశాయి.

పార్టీ పెట్టి రెండే సంవత్సరాలు. ముఖానికి రంగులేసుకునే వాడు ఏం చేయగలుగుతాడ్నారు. అసలు అనుభవమే లేదు.. రాజకీయాలకు పనికిరాడన్నారు. రాజకీయాలు చేయడమంటే.. సినిమాలు తీసినంత ఈజీ కాదన్నారు. కాని… అలా అన్నోళ్ల నోళ్లను మూయించేశాడు విజయ్‌. ఒకే ఒక్క దెబ్బతో.. రెండు బలమైన రాజకీయ పార్టీలకు మరణశాసనం రాశాడు. అసలు ఎవరీ విజయ్‌? ఆయన రాజకీయ, సినీ ప్రస్థానమేంటి? విజయ్‌ జోసెఫ్‌. ఈ పేరు చెబితే తమిళనాడు షేక్‌ అయిపోతుంది. ఆయనకున్న క్రేజ్‌ను దక్షిణాదిలో మరే హీరోతో పోల్చలేం. ఎందుకంటే ఆయనది ఓ కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితం అయిన స్టార్‌డమ్‌ కాదు. అన్ని వర్గాలను, అన్ని వయసుల వారీని విజయ్‌ ఆకట్టుకున్నారు. తన సినిమాలతో.. తన నటనతో.. తన డ్యాన్సులు, ఫైట్లతో సౌతిండియా టాప్‌ స్టార్‌గా ఎదిగారు విజయ్‌. జూన్‌ 22, 1974లో చెన్నైలో జన్మించారు విజయ్‌. ఆయన తండ్రి S.A. చంద్రశేఖర్‌, సినిమా డైరెక్టర్‌. తల్లి శోభా చంద్రశేఖర్‌, గాయని. తండ్రి క్రిస్టియన్‌, తల్లి హిందూ..! అయితే విజయ్‌ మాత్రం కుల మతాలకు అతీతంగా పెరిగారు. ఆయన స్కూల్లో చదువుకునే సమయంలో తండ్రి చంద్రశేఖర్‌.. క్యాస్ట్‌ కాలంలో తమిళ్‌ అని రాయించారు. తనది పలానా కులం అని ఇప్పటివరకు విజయ్‌ చెప్పుకోలేదు. పేరులో జోసెఫ్‌ ఉన్నా.. తనది క్రైస్తవ మతం అని గాని.. పలానా మతానికి తన మద్దతు అని గాని ప్రకటించలేదు. 1999లో సంగీతతో వివాహం జరిగింది. విజయ్‌, సంగీత దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. విజయ్‌ మొత్తం 65కు పైగా చిత్రాల్లో నటించారు. 1992లో నాలయ్య తీర్పు అనే సినిమాతో తెరంగేట్రం చేశారాయన. కాని ఆయనకు పరాజయాలే ఎదురయ్యాయి. నాలుగేళ్ల ఒడిదుడుకుల తర్వాత 1996లో విడుదలైన పూవె ఉనక్కగ సినిమాతో తొలి విజయం అందుకున్నారు. కాని ఆయనకు మాస్‌ ఇమేజ్‌ రాడానికి మరో 8 ఏళ్లు పట్టింది. 2004లో విడుదలైన గిల్లి సినిమాతో మాస్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆతర్వాత తిరుపాచ్చి, పోకిరి వంటి వరుస హిట్లతో తమిళనాడులో టాప్‌ హీరోగా ఎదిగారు. తన మార్కెట్‌ను విస్తరించారు. తుపాకీ, కత్తి, మెర్సల్‌, సర్కార్‌, మాస్టర్‌, లియో అంటూ వరుస హిట్లు కొట్టడమే కాదు.. ఈ సినిమాలతో అండర్‌ కరెంట్‌గా వివిధ పార్టీలపై సెటైర్లు వేస్తూ.. పొలిటికల్‌ లాంచ్‌ ప్యాడ్‌గానూ ఉపయోగించుకున్నారు విజయ్‌. ఆయన తమిళనాడు, కేరళలో భారీ ఫ్యాన్‌బేస్‌ను ఏర్పర్చుకున్నారు విజయ్‌. విజయ్‌ డ్యాన్సులకు సెపరేట్‌ కల్ట్‌ ఉంది. ఆయన నటన అంటే తమిళ యువత పడిచస్తారు. సినిమా ప్రమోషన్లే కాదు.. ఎలాంటి స్టేజ్‌ ఎక్కినా ఫ్యాన్స్‌ కోసం ఏదైనా చేస్తారు. పాటలు పాడతారు, డ్యాన్సులూ వేస్తారు. పంచ్‌ డైలాగ్‌లు సైతం విసురుతారు. సినిమాలే కాదు.. విజయ్‌లో మంచి ఫిలాంత్రోపిస్ట్‌ కూడా ఉన్నారు. విజయ్‌ మక్కల్‌ ఇయక్కంతో ఫ్యాన్‌ వెల్ఫేర్‌ సంస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా అభిమానులకు ఉచిత భోజనం, బ్లడ్‌ డొనేషన్ క్యాంపులు, వారి కుటుంబాల్లో చదువు కోసం ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. ఇక స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్స్‌, పబ్లిక్‌ పరీక్షల్లో టాప్‌ విచ్చిన వారికి క్యాష్ రివార్డులు ఇస్తూ వస్తున్నారు విజయ్‌. కోవిడ్‌తోపాటు.. తుఫాన్లు వచ్చినపుడు విజయ్‌ కోట్లాది రూపాయలు ప్రజల కోసం ఖర్చుచేశారు. అంతేకాదు.. తన పుట్టినరోజు నాడు ఫ్యాన్స్‌తో అన్నదానం, ఆర్థిక సాయాన్ని ఇప్పించారు విజయ్‌. ఈ కార్యక్రమాలు విజయ్‌ను మరో లెవెల్‌లో నిల్చోబెట్టాయి. ప్రజల్లో మాస్‌ పాపులారిటీతోపాటు, బలమైన ఫ్యాన్‌ బేస్ వచ్చింది. ఇవన్నీ విజయ్‌ టీవీకే పార్టీ స్థాపనకు, ఎన్నికల్లో విజయానికి ఎంతో దోహదపడ్డాయి. అంతేకాదు.. గత ఎన్నికల్లో ఆయన సైకిల్‌ మీద ఓటు వేయడానికి వెళ్లి.. తన సందేశాన్ని క్లియర్‌గా పాస్‌ చేశారు. 2024 ఫిబ్రవరిలో టీవీకే పార్టీ స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. సరిగ్గా ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ పెట్టడం ఒక ఎత్తైతే.. ఎవరితో పొత్తు లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించడం మరో ఎత్తు. పార్టీ జెండా నుంచి.. మేనిఫెస్టో వరకు అంతా పక్కాగా ప్లాన్‌ చేసుకున్నారు విజయ్‌. అందరికీ చదువు, అవినీతి రహిత పాలన, యూత్‌ ఎంపవర్‌మెంట్‌ థీమ్‌తో పార్టీని లాంచ్‌ చేసి.. సభలు, ప్రచారంలోనూ తనదైన మార్క్‌ వేశారు. అయితే కష్టాలు కూడా అంతే వెంటాడాయి. కరూర్‌ ర్యాలీలో జరిగిన ఘోరం ఆయనను కుంగదీసింది. దాదాపు రెండు నెలల పాటు విజయ్‌ బయటకు రాలేదు. కరూర్‌ తొక్కిసలాటలో 40మందికి పైగా చనిపోవడం దేశవ్యాప్త చర్చగా మారింది. అంతేకాదు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేయడం.. ఢిల్లీలో విచారణకు కూడా హాజరయ్యారు. అదే సమయంలో విజయ్‌ భార్య విడాకులు ప్రకటించి షాక్‌ ఇచ్చింది. ఇంటి నుంచి బయటికి వచ్చి కోర్టు మెట్లెక్కింది. తన భర్త నుంచి తనకు విడాకులు కావాలంటూ.. నేరుగా కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కారణంగా విజయ్‌ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాటే రాజకీయనాయకులు కూడా.. ఈ విడాకుల మ్యాటర్‌ను వాడుకుని విజయ్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. తూటాల్లాంటి మాటలతో విజయ్‌ను ఇరుకున పెట్టారు. విజయ్‌ విడాకుల మ్యాటర్‌తో పాటే.. విజయ్‌ త్రిష మధ్య అఫైర్‌ నడుస్తోందని డీఎంకే నేతలు ప్రచారం చేయడం కూడా తమిళనాట సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే త్రిష ఆ నాయకులపై సీరియస్‌ కాగా.. విజయ్‌ మాత్రం వినూత్నంగా.. త్రిషతోనే ఓ పెళ్లికి వెళ్లి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. పర్సనల్ లైఫ్‌లోనే కాదు.. తన సినిమా రిలీజ్ విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విజయ్‌ తలపతి. విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ సినిమా విడుదల విషయంలోనూ DMK నేతల రాజకీయం చేశారనే కామెంట్ ఉంది. సెన్సార్ బోర్డ్‌ ముందు జననాయగన్ సినిమా ఆగిపోవడం.. సెన్సార్ బోర్డ్ తీరుపై జననాయగన్ మూవీ టీం కోర్టు మెట్లెక్కడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే జననాయగన్ మూవీ నెట్టింట లీకైంది. దీనిలో కుట్రకోణం ఉందని విజయ్ ఫ్యాన్స్‌ బలంగా నమ్మడంతో.. ఆయనకు సపోర్ట్‌గా చాలా మంది మాట్లాడారు. అయితే వెనక్కి తగ్గని కొంత మంది నేతలు జననాగయన్ సినిమాను రిలీజ్ కాకముందే లోకల్ ఛానెల్లో ప్రసారం చేశారు. ఇలా విజయ్‌ను నేరుగా కాకుండా.. ఇండైరెక్ట్‌గా దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఇలా విజయ్‌ చుట్టూ ఇలా వివాదాలు, కేసులు నడిచినా.. ఆయన్ను పర్సనల్‌గా ప్రొఫెషనల్‌గా దెబ్బకొట్టే ప్రయత్నం చేసినా… తలపతి మాత్రం వెనకంజ వేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని నిర్వహించారు. విజిల్స్‌ వేస్తూ.. సైకిల్‌ తొక్కుతూ.. పంచ్‌ డైలాగ్స్‌ పేలుస్తూ అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో ఆ జోష్‌ మొత్తం ఓట్లుగా టర్న్‌ అయ్యాయి. ఎన్నికల ఫలితాల్లో ఇదే క్లియర్‌గా కనిపించింది. విజయ్ చాలా ఇంట్రోవర్ట్‌. ఎదైనా జరిగితే ముడుచుకుపోతాడు. బయట పార్టీలకు వెళ్లడు. తన లైఫ్‌ అంతా ప్రైవేట్‌గానే సాగింది. అయితే ఎప్పటికపుడు వచ్చిన వివాదాలు ఇబ్బందులు పెట్టినా.. ఆయన చేసిన కార్యక్రమాలు, ఇన్నోవేటివ్‌ ప్రచారంతో అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ విక్టరీ కొట్టారు. ఇప్పుడు విజయ్‌ సీఎం అయ్యే చాన్స్‌ వందశాతం ఉంది. పొత్తా, మద్దతా అనేది పక్కనబెడితే పోటీ చేసిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అద్భుత ఘట్టం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Squirrel: యూనివర్సిటీలో 18 మందిని కరిచిన ఉడుత !!

Monalisa Bhosle: ఆ నలుగురిపై కేసు పెట్టిన మోనాలిసా

హైదరాబాద్‌లో క్యాబ్‌ దోపిడీ.. రూ.200 జర్నీకి రూ.500 వసూల్

బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారా ?? రూల్స్ మారాయి.. జాగ్రత్త

తండ్రి సెక్యూరిటీ గార్డు.. కోటి ఆశలతో అమెరికాకు కొడుకు.. క్షణికావేశంలో..

Follow Us