Pawan Kalyan: శభాష్ సజ్జనార్..! పవన్‌ అభినందనలు

Updated on: Nov 20, 2025 | 12:04 PM

పవన్ కళ్యాణ్ ఐబొమ్మ రవి అరెస్ట్‌పై స్పందిస్తూ, పైరసీని కట్టడి చేసిన సజ్జనార్‌ను, సైబర్ క్రైమ్ పోలీసులను ప్రశంసించారు. సినిమా పరిశ్రమకు పైరసీ వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఐబొమ్మ, బప్పమ్ నిర్వాహకుల అరెస్ట్ స్వాగతించదగిన పరిణామమన్నారు. సజ్జనార్ చర్యలు తెలుగు సినిమాకే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు. సజ్జనార్‌ను.. ఆయన కృషిని మెచ్చుకున్నారు. అంతేకాదు డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి ప్రొడ్యూసర్లు, దర్శకులు సినిమాలు నిర్మిస్తారని.. సినిమా రిలీజ్‌ మొదటిరోజే ఇంటర్నెట్‌ లో పోస్ట్ చేస్తున్న ఇలాంటి ముఠాల వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతున్నారని పవన్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూసేయించడం స్వాగతించదగ్గ పరిణామం అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశారు పవన్‌. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైందన్నారు. ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ సజ్జనార్ కి అభినందనలు తెలియజేశారు పవన్‌. అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చిందని తెలిపారు. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయని పవన్‌ తన ట్వీట్ లో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శబరిమలకు పోటెత్తిన భక్తులు.. స్వామి దర్శనానికి 18 గంటలు