ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

Updated on: Jan 04, 2026 | 11:39 AM

టాలీవుడ్ సినీప్రియులకు హీరోయిన్ రాశి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మారింది. అప్పట్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోలతో వరుసగా హిట్స్ చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ఆమె చేసిన ఒక సినిమా తన జీవితాన్ని మలుపు తిప్పిందట. ఆ మూవీతో తన కెరీర్ నాశనమైందని ఓ ఇంటర్వ్యూలో ఆమె మోహమాటం లేకుండా చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహేష్ హీరోగా.. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఫిల్మ్ నిజం. ఈ సినిమాలో రాశి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించింది. అయితే తాను చేసిన ఆ క్యారెక్టర్ తన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రాశి. డైరెక్టర్ తేజ నిజం సినిమా స్టోరీ మొదట చెప్పినప్పుడు చేద్దామనే అనుకున్నట్టు చెప్పిన రాశి.. ఆ తరువాత తను చెప్పినట్టే బరువు తగ్గడం, లెన్స్‌లు పెట్టుకోవడం, మేకప్ లేకుండా కేవలం లిప్‌స్టిక్, కాజల్‌తో సహజమైన లుక్‌లోకి మారడం వంటి మార్పులు చేసుకున్నా అంటూ చెప్పింది. కానీ షూటింగ్ మొదటి రోజునే ముందుగా తనకు చెప్పని ఒక అభ్యంతరకరమైన సన్నివేశాన్ని తేజ చిత్రీకరించారని రాశి రివీల్ చేసింది. ఆ సన్నివేశం తన ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని, తన కెరీర్‌కు అది ఫుల్‌స్టాప్ పెడుతుందని ఆక్షణం తాను ఆందోళన చెందినట్టు చెప్పుకొచ్చింది. తాను ఆ సీన్ చేయడానికి నిరాకరించగా, తన PRO బాబూరావుతో సహా చాలా మంది తనను ఒప్పించడానికి ప్రయత్నించారని చెప్పింది. చివరికి అయిష్టంగానే ఆ సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని రాశి వివరించింది. ఆ తర్వాత డబ్బింగ్ కూడా పూర్తి చేశాక, తేజ తనకు క్షమాపణలు చెప్పారని, అయితే ఆ క్షమాపణలు తన కెరీర్ నష్టాన్ని పూడ్చలేవని ఆమె స్పష్టం చేసింది. ఆ సినిమా తర్వాత తాను సినిమాలు చేయలేదని, అది తన కెరీర్‌కు పెద్ద దెబ్బ అని ఇప్పటికీ భావిస్తున్నట్టు చెప్పుకొచ్చింది రాశీ.