ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు
ద్వారకా తిరుమల దేవస్థానంలో భారీ నకిలీ టికెట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, స్వయానా దేవస్థానం ఉద్యోగులే ఈ మోసానికి పాల్పడ్డారు. పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి, లక్షలాది రూపాయల మోసాన్ని ఛేదించారు. నకిలీ టికెట్ల ముద్రణకు వాడిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, సాక్షాత్తూ స్వామివారి చెంతనే అక్రమాలకు తెరలేపిన కిలాడీల ఆట కట్టించారు పోలీసులు. ద్వారకా తిరుమల దేవస్థానంలో కలకలం రేపిన నకిలీ టికెట్ల విక్రయాల కేసులో ప్రధాన నిందితులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో దేవస్థానానికి చెందిన ఉద్యోగులే సూత్రధారులుగా తేలడం భక్తులను విస్మయానికి గురిచేస్తోంది. ద్వారకా తిరుమల దేవస్థానంలో నకిలీ టికెట్ల విక్రయం కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దేవస్థానం టికెట్ కౌంటర్ ఉద్యోగి సాయి జగన్నాథరాజు, కంప్యూటర్ సూపర్‌వైజర్ రమేష్ కలిసి ఈ మోసానికి స్కెచ్ వేశారు. తాడేపల్లిగూడెంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న రమేష్ స్నేహితుడు ముత్యాల వెంకట సత్య శ్రీనివాసరావు సహకారంతో వీరు ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అసలైన టికెట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీ టికెట్లను ముద్రించి, కౌంటర్ల ద్వారానే భక్తులకు విక్రయించి లక్షలాది రూపాయలు దారి మళ్లించారు. మార్చి నెలలో జరిగిన తనిఖీల్లో 61 నకిలీ టికెట్లు దొరకడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. దేవస్థానం ఈఓ భద్రాజి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. గతంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన నిందితులతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నకిలీ టికెట్ల ముద్రణకు ఉపయోగించిన ల్యాప్‌టాప్, హై-క్వాలిటీ ప్రింటర్, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేవస్థానంలో ఇలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు నిఘా పెంచారు. ఎవరైనా నకిలీ టికెట్లు అమ్ముతున్నట్లు తెలిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. సొంత ఉద్యోగులే ఈ దగాకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం
