జగన్‌తో గొడవల వల్ల నష్టమే జరిగింది.. TV9 క్రాస్‌ఫైర్‌లో రఘురామ సంచలన కామెంట్స్
జగన్‌తో పోరాటం వల్ల రాజకీయంగా లబ్ధి కంటే నష్టమే ఎక్కువ జరిగిందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు. ఢిల్లీ నుంచి ఏపీకి రానివ్వకుండా చేసిన అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు సీటుపై డౌట్ నెలకొందంటూ TV9 క్రాస్ ఫైర్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో స్పందించారు. టీవీ9 క్రాస్ ఫైర్‌లో తన రాజకీయ ప్రయాణం, మాజీ సీఎం జగన్‌తో విభేదాలు, ప్రస్తుత తన స్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో తన పోరాటం రాజకీయంగా తనకు ఎలాంటి కిరీటాన్ని తెచ్చిపెట్టలేదని, పైగా తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆర్ఆర్ఆర్ కుండబద్దలు కొట్టారు. ‘‘2019 నుంచి 2024 మధ్య కాలంలో అక్రమ కేసులు పెట్టి నన్ను సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి ఏపీకి రానివ్వకుండా చేశారు. పార్లమెంటులో నాకు దక్కిన సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్‌షిప్‌ను కూడా పీకేసే వరకు వారు ఊరుకోలేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంటరి పోరాటం.. ఆఖరి నిమిషంలో సీటు
గత మూడేళ్లుగా తాను సోలో ఫైటర్‌గా ఒంటరి పోరాటం చేశానని, అది ప్రతి తెలుగు వ్యక్తికి తెలుసని రఘురామ తెలిపారు. ఎన్నికలకు కేవలం 18 రోజుల ముందు వరకు తనకు ఎంపీ సీటు కాదు కదా, ఎమ్మెల్యే సీటు వస్తుందో లేదో తెలియని అనిశ్చితి నెలకొందని గుర్తు చేసుకున్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు తనకు ఉండి నియోజకవర్గం ఇచ్చారని తెలిపారు. రాజకీయాల్లో ‘యూజ్ అండ్ త్రో’ సంస్కృతి సర్వసాధారణమని, దీనివల్ల తనకు చిన్నప్పటి నుంచే ఉన్న స్థిత ప్రజ్ఞత ఇప్పుడు మరింత పెరిగిందని ఆర్ఆర్ఆర్ అన్నారు. తన ప్రయాణం కోపం, ఆవేశం, ఫ్రస్ట్రేషన్‌లను దాటి ప్రస్తుతం వైరాగ్యానికి చేరుకుందని ఆయన నవ్వుతూ చెప్పారు.
