బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హై అలర్ట్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి కోళ్ల పరిశ్రమను తీవ్రంగా కలవరపెడుతోంది. సదుం నుండి కార్వేటినగరం వరకు విస్తరించిన ఈ వ్యాధితో వేల సంఖ్యలో కోళ్లు మరణించాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై శాస్త్రీయ పద్ధతిలో కోళ్లను పూడ్చిపెట్టి, నమూనాలను భోపాల్‌కు పంపింది. వ్యాప్తి నివారణకు బయో-సెక్యూరిటీ నిబంధనలు పాటించాలని, కోళ్లు, గుడ్ల విక్రయం నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సంక్షోభం పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ప్రమాదముంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ‘మాయరోగం’ కోళ్ల పరిశ్రమను వణికిస్తోంది. సదుం మండలంలో మొదలైన బర్డ్‌ఫ్లూ ఉధృతి, ఇప్పుడు కార్వేటినగరం మండలానికి విస్తరించడం పౌల్ట్రీ యజమానులను, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్కేవీ పేట, ఇందిరా కాలనీల్లోని కోళ్ల ఫారాల్లో ఆదివారం ఒక్కరోజే వెయ్యికి పైగా కోళ్లు అకస్మాత్తుగా మరణించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వేల సంఖ్యలో కోళ్ల మరణాలపై జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ స్పందిస్తూ పశుసంవర్ధక శాఖ అధికారులను రంగంలోకి దింపారు. అధికారులు మరణించిన కోళ్లను జేసీబీలతో పెద్ద గోతులు తవ్వి, శాస్త్రీయ పద్ధతిలో పూడ్చిపెట్టారు. వ్యాధి నిర్ధారణ కోసం బ్లడ్ శాంపిల్స్‌ను భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్‌కు పంపారు. నివేదికలు వచ్చే వరకు కోళ్లను గానీ, గుడ్లను గానీ విక్రయించకూడదని, ఫారాల్లోకి బయటి వ్యక్తులను అనుమతించవద్దని యజమానులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, హెల్త్ మరియు పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు తప్పనిసరిగా ‘బయో సెక్యూరిటీ’ నిబంధనలు పాటించాలని సూచించారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున కోళ్ల ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో, ఈ వైరస్ గనుక విస్తరిస్తే కోళ్ల పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంగన్‌వాడి చిన్నారులకు పాఠాలు చెప్పిన ఐఏఎస్
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు షాక్.. కల్కి-2 ఇప్పట్లో లేనట్టేనా ??
సంక్రాంతి బరిలో నాగ్, నాగచైతన్య మల్టీ స్టారర్