Tomato Crisis: కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. రోడ్లపైనే కుప్పలుగా..

Updated on: Feb 11, 2026 | 1:39 PM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో టమోటా ధరలు కిలో రూ. 5కు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. సాగు ఖర్చులు పెరిగినప్పటికీ, గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్లపై పారబోస్తున్నారు. పత్తికొండ మార్కెట్ మూతపడింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని, టమోటా ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

టమోటా ధరలు మళ్ళీ పతనం కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. మదనపల్లి తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద టమోటా సాగు కేంద్రాలైన పత్తికొండ, ఆలూరు, ఆదోని, డోన్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమోటా ధర కేవలం రూ. 5 కు పడిపోయింది. కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, కనీసం కిలోకు రూ. 20 ధర లభిస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ, ప్రస్తుతం వస్తున్న ధర కనీసం మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొందరు కోసిన పంటను మార్కెట్‌కు తరలించినా రవాణా ఖర్చులు కూడా రావని రోడ్లపైనే పారబోస్తున్నారు. ఎంతోకొంత ధర రాకపోతుందా అని టమాటాలను మార్కెట్‌కు తరలించిన మరికొందరు రైతులు ఆశించిన ధర లేక పంటను మార్కెట్లోనే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. కొనేవారు కరువవడంతో వారం క్రితమే పత్తికొండ టమోటా మార్కెట్ మూతపడటం గమనార్హం. గతంలో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ కిలోకు కనీసం రూ. 8 తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని, టమోటా ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన

ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు.. చూస్తే కన్నీళ్లు ఆగవు

జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీల్లో గుండె ఝల్లుమనిపించే దృశ్యాలు

అరణ్యాలు దాటి హైవేపై ప్రత్యక్షమవుతున్న పులులు, సింహాలు.. భయాందోళనలో జనం

వెబ్ యూజర్లకు శుభవార్త.. ఇక బ్రౌజర్ నుండే నేరుగా వీడియో, ఆడియో కాల్స్