ఇదే బాగుంది గురూ.. అద్దెకు బంగారం.. లక్షలు సంపాదించండి
మీ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. పసిడి లీజింగ్ ద్వారా దొంగల భయం లేకుండా, లాకర్ అద్దె లేకుండా డబ్బు సంపాదించవచ్చు. ప్రభుత్వ 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్'తో పాటు ప్రైవేట్ సంస్థలూ ఈ సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే, వడ్డీ, గడువు, నష్టభయాలను పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. మీ పసిడిని తెలివిగా పెట్టుబడిగా మార్చండి.
మీ ఇంట్లో బంగారం వృథాగా ఉంటుందా.. దొంగల భయం ఎక్కువైందా.. అందుకే.. బ్యాంకు లాకర్లలో అద్దె కడుతూ దాచుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. బంగారం వృథాగా పడి ఉండకుండా..దొంగల భయం లేకుండా.. బంగారాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. దీనిని అద్దెకు ఇచ్చి దానిపై ఆదాయం పొందవచ్చు. ఈ పసిడి లీజింగ్ విధానం.. ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వడ్డీ కాస్త తక్కువగా వస్తుంది.
సాధారణంగా అన్ని ఆదాయ వర్గాల వారు బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటారు. దీంతోపాటు మిగులు ఆదాయం ఉన్న వారు, 24 క్యారెట్ల మేలిమి బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొని దాచుకుంటారు. డబ్బు రూపంలో కంటే బంగారం రూపంలో దాచుకుకంటే ఎప్పటికప్పుడు విలువ పెరగడంతోపాటు సంపద విలువ పెరుగుతుందని భావిస్తారు. అయితే, ఇళ్ల వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెడితే విలువ పెరగడంతో పాటు, అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. బంగారం కొని పెట్టుకుంటే.. విలువ పెరిగినా, దీనిపై నిరంతర ఆదాయం రావడం లేదనే అసంతృప్తి కొందరికి ఉంటుంది. ఇటువంటి వారికి ఊరట కలిగించేదే పసిడి ‘లీజ్’ విధానం. మేలిమి బంగారం బిస్కెట్లను ఆభరణాల విక్రేతలు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లకూ అద్దెకు ఇవ్వొచ్చు. రోజువారీ కార్యకలాపాల కోసం ఆభరణాల విక్రేతలకు నగదు లేదా మేలిమి బంగారం కావాలి. నగదు అయితే అధిక వడ్డీ చెల్లించాలి. తక్కువ వడ్డీకి పసిడి లభిస్తుంది కాబట్టి, దీనికి దుకాణదారులూ ముందుకొస్తున్నారు. బంగారాన్ని పూచీకత్తుపై లీజ్‌కు ఇస్తే 2% వడ్డీ, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని చెబుతున్నారు. ఇక మీవద్ద వృథాగా పసిడి ఆభరణాలు ఉంటే వాటిని అద్దెకు ఇవ్వొచ్చు. వాటిని కరిగించి, స్వచ్ఛమైన 999 బంగారు ముద్దగా మార్చి, దాని బరువు తూచి దాని ప్రకారం లీజుకు తీసుకుంటారు. కాలవ్యవధి తీరాక మళ్లీ మేలిమి బంగారం రూపంలోనే తిరిగి ఇస్తారు. అప్పటివరకు పసిడి విలువపై వడ్డీ చెల్లిస్తారు. అందువల్ల మీ ఆభరణాలు పాత రూపంలోనే ఉండాలనుకుంటే మాత్రం వీరికి ఇవ్వకూడదు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ఇస్తే ఇబ్బంది ఉండదు. ప్రైవేటు వ్యక్తులతో ఇబ్బంది అనుకుంటే, ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ బంగారాన్ని డిపాజిట్ చేసి, వడ్డీ పొందే అవకాశం ఉంది. దీనినే పసిడి నగదీకరణ పథకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల వద్ద వృథాగా ఉన్న బంగారాన్ని, వినియోగంలోకి తెచ్చేందుకు.. తద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారకపు ద్రవ్యాన్ని వెచ్చించకుండా చూసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. లాకర్‌లో పెట్టుకున్న బంగారాన్ని కావాల్సి వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చు. మనం నమ్మి లీజుకు ఇచ్చిన వ్యాపారి కనుక, ఆలస్యం చేస్తే.. అసలు దుకాణమే కట్టేస్తే.. ఈ నష్టభయం మాత్రం పొంచి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరాలుగా వ్యాపార సంస్థల నుంచి బంగారం బిస్కెట్లు తీసుకుని, ఆభరణాలు తయారు చేసి ఇచ్చే కొందరు.. పెద్దమొత్తం బంగారంతో పరారయ్యే ఘటనలు కూడా చూస్తున్నాం. అందులోనూ పసిడి ధర బాగా పెరిగిన నేపథ్యంలో, లీజుకు తీసుకున్న సంస్థ నిర్వాహకులు పరారైతే, ఏం చేయగలమనేది కూడా ఆలోచించుకోవాలి మరి. ఇదే విషయాన్ని ప్రపంచ స్వర్ణ మండలి కూడా హెచ్చరిస్తోంది. మన దగ్గర తీసుకున్నప్పుడు, పరీక్షించి మరీ 999 స్వచ్ఛతను నిర్థారించుకున్నా.. తిరిగి ఇచ్చేప్పుడు తక్కువ స్వచ్ఛత కలిగిన పసిడి బిస్కెట్లు ఇస్తే పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ప్రైవేటు వ్యాపారులను నమ్మి బంగారం ఇవ్వడం అంటే, వారిపై పూర్తి అవగాహన – వారి కార్యకలాపాలపై విశ్వాసం ఉంటేనే ముందడుగు వేయాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
20 ఏళ్లుగా చీకటి గదిలోనే.. బయటకు రాగానే చూపు కోల్పోయిన యువతి
ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. ATM నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా
భూమ్మీదకు ఏలియన్స్ చూసిన వాళ్లకు కాలిన గాయాలు, మచ్చలు