బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి సమయమా ??
బడ్జెట్ 2026కు ముందు బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పడిపోయాయి. బడ్జెట్‌లో దిగుమతి సుంకాల్లో మార్పులు లేకపోయినా, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణతో ధరలు తగ్గాయి. ఇది హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా పసిడి కొనుగోలుదారులకు ఒక అవకాశం. పన్నులు పెరగకపోవడం ఊరట కలిగించగా, తక్కువ ధరలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మార్కెట్ స్థిరత్వం కలిసొస్తుంది.
ప్రస్తుతం దేశమంతా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ బడ్జెట్ కంటే ముందే బంగారం, వెండి మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళిన పసిడి ధరలు, బడ్జెట్ ముంగిట భారీగా దిగివచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బంగారం ధరలలో కనిపిస్తున్న ఈ మార్పులు సామాన్యులకు ఒక పక్క ఆనందాన్ని, మరోపక్క అయోమయాన్ని కలిగిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ, పసిడి ప్రేమికులకు మాత్రం ఈసారి ఒక ముఖ్యమైన అప్‌డేట్ లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారం , వెండి దిగుమతి సుంకాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే పాత పన్ను రేట్లే కొనసాగుతాయి. ఈ నిర్ణయం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపింది? ధరలు ఎందుకు తగ్గాయి? అనేది ఇప్పుడు చూద్దాం. బడ్జెట్ నిర్ణయం: మారినది ఏమిటి? మారనిది ఏమిటి?..చాలా మంది ఈసారి బడ్జెట్‌లో బంగారంపై పన్నులు తగ్గుతాయని ఆశించారు. కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి బంగారంపై పన్ను విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించింది. గత బడ్జెట్‌లో నిర్ణియించిన ప్రకారం బంగారంపై ప్రస్తుతం ఉన్న 6% సుంకం అలాగే ఉంటుంది. ఇక వెండి విషయానికి వస్తే…అర్హత కలిగిన భారతీయులకు వెండి దిగుమతిపై 6% పన్ను కొనసాగుతుంది. ఇతరులకు ఇది 36% వరకు ఉంటుంది. ఇక బంగారం, వెండిపై ఎప్పటిలాగే 3% జీఎస్టీ అదనంగా ఉంటుంది. మార్కెట్‌లో గందరగోళం ..నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో “వ్యక్తిగత అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను 20% నుంచి 10%కి తగ్గిస్తున్నాం” అని చెప్పడంతో.. బంగారం ధరలు కూడా తగ్గుతాయని చాలా మంది భ్రమపడ్డారు. కానీ, ఈ మినహాయింపు బంగారం, వెండి , విలువైన లోహాలకు వర్తించదు. ఇది కేవలం విదేశాల నుంచి తెచ్చుకునే బట్టలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వంటి వ్యక్తిగత వస్తువులకు మాత్రమే పరిమితం. బడ్జెట్‌లో సుంకాలు తగ్గకపోయినా, గత రెండు రోజులుగా బంగారం , వెండి ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం..లాభాల స్వీకరణ: పన్ను తగ్గుతుందనే ఆశతో రేట్లు తగ్గుతాయని భావించిన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపారు. బంగారం తన గరిష్ట ధర రూ.1,82,500 నుంచి దాదాపు రూ.1,47,800 స్థాయికి పడిపోయింది. అంటే సుమారు 20% తగ్గింది. వెండి ధర అయితే ఇంకా దారుణంగా పడిపోయింది. కేజీ రూ.4,20,000 నుంచి రూ.2,65,650 కి చేరింది. అంటే దాదాపు 36% క్షీణించింది. చివరిగా కొనుగోలుదారులకు సూచన ఏంటంటే..ప్రభుత్వం పన్నులు పెంచకపోవడం ఒక విధంగా ఊరటనిచ్చే అంశమే. మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పతనం వల్ల బంగారం ధరలు సామాన్యులకు కొంత అందుబాటులోకి వచ్చాయి. పెళ్లిళ్ల కోసం నగలు కొనాలనుకునే వారు ఈ తగ్గుదలను గమనిస్తూ అంచెలంచెలుగా కొనుగోలు చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. మొత్తంగా చూస్తే.. బడ్జెట్ 2026 బంగారంపై ఎలాంటి అదనపు భారాన్ని మోపలేదు. అయితే అంతర్జాతీయ కారణాలు , ఇన్వెస్టర్ల అమ్మకాల వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో మార్కెట్ స్థిరపడిన తర్వాతే స్పష్టమైన ధరలు తెలుస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాగు రంగానికి నిర్మలమ్మ సాయం ఎంత ??