దేశంలో నిరుపయోగంగా రూ.940 లక్షల కోట్ల బంగారం

Updated on: Mar 28, 2026 | 11:48 AM

భారతదేశంలో 50,000 టన్నుల బంగారం నిరుపయోగంగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్. దీని మార్కెట్ విలువ దాదాపు 940 లక్షల కోట్ల రూపాయలు. ఈ సంపద దేశాభివృద్ధికి ఉపయోగపడటం లేదు, దిగుమతులకు కారణమవుతోంది. ఫిజికల్ బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్‌ల (EGR) గా మార్చడం పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, 3% జీఎస్టీ దీనికి ప్రధాన అడ్డంకిగా మారింది.

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్.. సురక్షితమైన పెట్టుబడి. అయితే, ఇదే సెంటిమెంట్ ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోంది. మన దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో సుమారు 50,000 టన్నుల బంగారం నిరుపయోగంగా మూలుగుతోందని కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసోచాం నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన.. ఈ బంగారం ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్ల డాలర్లు అంటే సుమారు రూ. 940 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంత భారీ సంపద దేశంలోనే ఉన్నప్పటికీ, అది కేవలం బీరువాలకే పరిమితం కావడంతో దేశ ఆర్థికాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా బంగారం ధర ఏటా 30 శాతం పెరుగుతున్నా, భారతీయుల్లో కొనుగోలు శక్తి తగ్గకపోవడం గమనార్హం. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే నమ్మకంతో ప్రజలు బంగారాన్ని కొని దాచుకుంటున్నారు. దీనివల్ల వ్యక్తిగత ఆస్తుల విలువ పెరిగినా, అధిక దిగుమతుల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోంది. ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే దిగుమతులు తగ్గడమే కాకుండా, కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోకి వస్తుందని చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా భౌతిక బంగారాన్ని , ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్‌ గా మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. NSE చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ దీనిపై స్పందిస్తూ.. EGRలను స్టాక్ మార్కెట్‌లో షేర్ల మాదిరిగానే సులభంగా కొనుగోలు చేయడం, విక్రయించడం చేయవచ్చని తెలిపారు. అయితే, ఫిజికల్ బంగారాన్ని ఈజీఆర్‌గా మార్చేటప్పుడు చెల్లించాల్సిన 3 శాతం జీఎస్టీ ఈ పథకానికి ప్రధాన అడ్డంకిగా మారింది. సాధారణ ప్రజలతో పాటు దేవాలయాలకు కూడా ఇది భారం కావడంతో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ జీఎస్టీ సమస్యను పరిష్కరిస్తేనే గోల్డ్ మోనిటైజేషన్ సక్సెస్ అవుతుందని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు శ్రీరామ్ కృష్ణన్ వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిట్స్‌ వచ్చి బైక్‌తో పడిపోయిన వ్యక్తి..కాపాడబోయిన రైతుకు షాక్‌

కాలేజ్‌ బాత్రూమ్‌లో వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా గుండె గుభేల్‌

Dhurandar 2: ధురంధర్‌ సక్సెస్ విషయంలో బాలీవుడ్ సైలెన్స్‌కు రీజనేంటి ??

Drishyam 3: దృశ్యం 3 విషయంలో కన్ఫ్యూజన్.. తెలుగు వెర్షన్ ఉంటుందా ?? లేదా ?? అన్న డౌట్స్‌

స్టైల్ మార్చిన అందాల భామలు

Follow Us