మెరిసిన ఎర్ర బంగారం.. మిర్చి రైతుకు పండగే
గిట్టుబాటు ధర లేక ఐదేళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన మిర్చి రైతులకు ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్, తగ్గిన సాగు కారణంగా మిర్చి ధరలు క్వింటాలుకు రూ. 20,000 చేరాయి. అధిక సాగు ఖర్చుల తర్వాత ప్రస్తుత ధరలు అన్నదాతలకు ఆశలు కల్పిస్తున్నాయి. రైతులు లాభాలు పొంది, ఐదేళ్ల నష్టాల నుండి బయటపడుతున్నారు.
గిట్టుబాటు ధర లేక మిర్చి రైతు ఐదేళ్లుగా కుంగిపోయాడు. 90% మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇక సాగు చేయలేమంటూ కొందరు చేతులెత్తేసారు. మరికొందరు సాగు తగ్గించుకున్నారు. ఈ ఏడాదీ ధర లేకుంటే కాడి కింద పడేయాల్సిన దుస్థితి. ఈ సమయంలో జనవరి నుంచి మిరప ధరలు పుంజుకోవడంతో అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు మిర్చి సగటున రూ. 20 వేల వరకు పలుకుతుండటం విశేషం. అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు నేరుగా గ్రామాలకు వెళ్లి రైతుల నుంచి సరకు కొనుగోలు చేస్తున్నారు. జనవరితో పోలిస్తే క్వింటాలుకు రూ. 5 వేల వరకు ధర పెరిగింది. గతేడాది రూ. 10 వేల లోపు పలికిన మిర్చి రకాలు, ఇప్పుడు రూ. 20 వేల మార్కును దాటాయి. ఫిబ్రవరి నెలలో రూ. 15 వేలు ఉన్న ‘తేజ’ రకం ప్రస్తుతం రూ. 19,500కు చేరింది. తాలు మిర్చి కూడా క్వింటాలు రూ. 10 వేల పైనే పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల మిర్చి యార్డులో రికార్డు స్థాయిలో ధరలు నమోదవుతున్నాయి. గతంలో ఇదే మార్కెట్‌లో దేశీ ఎల్లో మిర్చి క్వింటాల్ గరిష్టంగా ₹42,000 నుండి ₹52,000 వరకు పలికింది. ప్రస్తుతం తేజ, 334 సన్నం రకం.. ₹16,000 నుండి ₹22,000 మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఏడాది సాగు తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. నల్లతామర పురుగు, జెమిని వైరస్ ఉధృతి వల్ల సాగు ఖర్చులు ఎకరాకు రూ. 4 లక్షల వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, సగటున రూ. 4.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సరకును నిల్వ చేయకుండా వెంటనే విక్రయిస్తున్నారు. గుంటూరు యార్డుకు గత మంగళవారం వచ్చిన 1.29 లక్షల బస్తాల్లో దాదాపు 1.26 లక్షల బస్తాలు అమ్ముడుపోవడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఐదేళ్ల నష్టాల తర్వాత దక్కిన ఈ ధరతో మిర్చి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..
బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..
PAN Card: అలర్ట్.. మారబోతున్న పాన్ రూల్స్.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి