Viral: అయ్య బాబోయ్.. ఆ మహిళా దొంగ మేకప్ ఖర్చు నెలకు రూ. 5 లక్షలు
బెంగళూరులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగ జంట గాయత్రి, శ్రీకాంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాయత్రి నెలకు రూ.5 లక్షలు మేకప్, ఖరీదైన చీరల కోసం ఖర్చు చేసేదని దర్యాప్తులో వెల్లడైంది. వీరి నుండి రూ.60 లక్షల విలువైన 398 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగ జంటను పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు జిల్లా చిక్కేరూరుకు చెందిన గాయత్రి, శ్రీకాంత్ భార్యాభర్తలు. బెంగళూరులోని కమ్మసాండ్రలో నివాసం ఉంటున్న వీరు టిప్ టాప్‌గా ముస్తాబై, జనసంచారం ఎక్కువగా ఉండే ఆలయాలు, మార్కెట్లు, ఉత్సవాల వద్ద చోరీలు చేసేవారు. పోలీసులు విచారణలో భాగంగా ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గాయత్రి, శ్రీకాంత్‌లు మొదట విగ్గులు, స్టీల్ పాత్రల వ్యాపారం చేసేవారు. అయితే అందులో తక్కువ లాభాలు రావడంతో, త్వరగా ధనవంతులు కావాలనే కోరికతో దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడేవారు. చోరీలకు వెళ్ళినప్పుడు తాము దొంగలమని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాయత్రి నెలకు రూ.5 లక్షలు మేకప్, ఖరీదైన చీరల కోసం ఖర్చు చేసేదని తెలిసింది. మేకప్ లేకుండా తాను బయటకు కూడా వెళ్ళేదాన్ని కాదని ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది.